సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 03:02:27

రాష్ర్టాల హక్కులకు గొడ్డలిపెట్టు

రాష్ర్టాల హక్కులకు గొడ్డలిపెట్టు

  • రాష్ర్టాలను సంప్రదించకుండా రాష్ర్టాల జాబితాలోని అంశంపై కేంద్రం నిర్ణయం
  • రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌పై ఒత్తిడి.. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు
  • రైతులు కూలీలుగా మారే ప్రమాదం.. టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత కేశవరావు
  • రైతులకు బ్లాక్‌ డే.. బీజేపీకి ప్రజలే బుద్ధిచెప్తారు: లోక్‌సభ పక్ష నేత నామా
  • హక్కులకు పాతర

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌పై ఒత్తిడి తెచ్చి కేంద్రప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవసాయ బిల్లులను ఆమోదింపజేసుకున్నదని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత కేశవరావు ఆరోపించారు. బిల్లులను వ్యతిరేకించిన కొందరు ఎంపీలపై సిబ్బందితో దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 12 ఏండ్లుగా ఎంపీగా ఉన్నానని, ఇలా రాష్ర్టాల హక్కులను కాలరాసి బిల్లులను ఆమోదింపజేసుకోవడం ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల మేలు కోసం బిల్లులను తీసుకొచ్చామని చెప్తున్న కేంద్రప్రభుత్వం మద్దతు ధర కంటే తక్కువ రేటుతో ఎవరూ రైతుల వద్ద ధాన్యం కొనకూడదని ఆదేశించగలదా.. అని ప్రశ్నించారు.  బిల్లుపై ఓటింగ్‌ జరిగితే పాస్‌ కాదన్న భయంతోనే అప్రజాస్వామికంగా వ్యవహరించారన్నారు. సవరణలు ప్రతిపాదించినా పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ వ్యవహార శైలికి నిరసనగా 12 పార్టీలకు చెందిన దాదాపు 50 మంది సభ్యులం అవిశ్వాస తీర్మానం ఇచ్చామని తెలిపారు. 

రైతులు కూలీలుగా మారే ప్రమాదం

రాజ్యాంగం ప్రకారం రాష్ర్టాలకు సంక్రమించిన హక్కులకు వ్యవసాయ బిల్లులు గొడ్డలిపెట్టు అని కేశవరావు పేర్కొన్నారు. వ్యవసాయం రాష్ర్టాలకు సంబంధించిన అంశమని, వ్యవసాయ బిల్లులపై కేంద్రం ఒక్క రాష్ర్టాన్నీ సంప్రదించలేదని విమర్శించారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. దేశాన్ని, వ్యవసాయరంగాన్ని కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులను టీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు. వ్యవసాయ బిల్లుల ద్వారా రైతులు భూమిలేని కూలీలుగా మారుతారని కేశవరావు ఆందోళన వ్యక్తం చేశారు.

పార్లమెంట్‌ ఆవరణలో నిరసన


రాజ్యసభలో వ్యవసాయ బిల్లులపై కేంద్రం వ్యవహరించిన తీరుకు నిరసనగా టీఆర్‌ఎస్‌ పార్టీతో సహా కాంగ్రెస్‌, టీఎంసీ ఇతర పార్టీల ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ప్రధాని, కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలో టీఆర్‌ఎస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌, కేఆర్‌ సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు.

రైతులకు బ్లాక్‌ డే

ఈ రోజు రైతాంగానికి బ్లాక్‌ డే అని టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌ రావు అభివర్ణించారు. బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మీడియాతో  అన్నారు. రాజ్యసభలో ఓటింగ్‌ పెడితే బిల్లు వీగిపోతుందన్న భయంతో మూజువాణి ఓటుతో బిల్లులను ఆమోదించారని తద్వారా రైతుల గొంతు నొక్కారని అన్నారు. బిల్లు మంచిదే అయితే రాష్ర్టాలను ఎందుకు సంప్రదించలేదని, పార్టీలను ఎందుకు ఏకం చేయలేదని ప్రశ్నించారు. బిల్లు ఆమోదం సమయంలో సభ ప్రసారాలను నిలిపివేశారన్నారు. ఈ మీడియా సమావేశంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, పీ రాములు, కేఆర్‌ సురేశ్‌ రెడ్డి, లింగయ్య యాదవ్‌, మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, మాలోతు కవిత పాల్గొన్నారు.


logo