బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 01:50:42

డబుల్‌గా తెలంగాణ రైల్వే లైన్లు

డబుల్‌గా తెలంగాణ రైల్వే లైన్లు
  • కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయండి
  • రైల్వే పద్దులపై రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలోని సింగిల్‌ రైల్వే లైన్లను డబుల్‌గా మార్చాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ బండా ప్రకాశ్‌ కేంద్రాన్ని కోరారు. సోమవారం రాజ్యసభలో రైల్వే బడ్జెట్‌ పద్దుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణలో సికింద్రాబాద్‌- వరంగల్‌- కాజీపేట- బల్హార్షాకు డబుల్‌ లైన్‌ ఉన్నదని చెప్పారు. మిగిలిన ప్రాంతాలకు డబుల్‌గా మార్చాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. రైల్వే ప్రైవేట్‌ బాటలోకి వెళ్తుందనే ఆందోళన వ్యక్తంచేశారు.విభజన చట్టంలో పొందుపర్చిన  కోచ్‌ఫ్యాక్టరీ హామీని నెరవేర్చలేదన్నారు. కాజీపేట నుంచి కరీంనగర్‌కు వయా ఎల్కతుర్తి, హుజూరాబాద్‌ మీదుగా రైల్వే లైన్‌ వేయాలని కోరారు.  


సంస్కృత వర్సిటీ బిల్లుకు మద్దతు: ఎంపీ లక్ష్మీకాంతారావు

సెంట్రల్‌ సంస్కృత వర్సిటీ బిల్లుకు టీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపింది. రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు టీఆర్‌ఎస్‌ మద్దతు ఉంటుందని ప్రకటించారు. మూడు డిమ్డ్‌ టూ బీ సంస్కృతం వర్సిటీలను సెంట్రల్‌ వర్సిటీలుగా అభివృద్ధి చేయడాన్ని హర్షిస్తున్నామని చెప్పారు. డిగ్రీస్థాయిలోనూ సంస్కృతం ఉండాలని, కర్ణాటక రాష్ట్రం షిమోగా జిల్లా మాథూర్‌లో అందరూ సంస్కృతం మాట్లాడుతారని తెలిపారు. 


నిజాం సొమ్మును రాష్ర్టానికి ఇవ్వండి: ఎంపీ రంజిత్‌రెడ్డి 

నిజాం ఆస్తులను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రంజిత్‌రెడ్డి కోరారు. లోక్‌సభలో 377 నిబంధన కింద ఆయన మాట్లాడుతూ.. బ్రిటన్‌ హైకోర్టులో పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం కేసును గెలిచిందని గుర్తుచేశారు. దీని ద్వారా 35 మిలియన్‌ పౌండ్లు భారతదేశానికి వచ్చాయన్నారు. ఈ మొత్తాన్ని తెలంగాణకు బదిలీ చేయడం ద్వారా రాష్ట్రంలోని పేదలకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఆ మొత్తం తెలంగాణ ప్రజలదే అయినందున బదిలీ చేయాలని విజ్ఞప్తిచేశారు.


logo