శనివారం 30 మే 2020
Telangana - May 23, 2020 , 19:20:21

చిన్నారికి అండగా ఎమ్మెల్సీ పోచంపల్లి

చిన్నారికి అండగా ఎమ్మెల్సీ పోచంపల్లి

వ‌‌రంగ‌ల్ : రెక్కాడితేగానీ, డొక్కాడ‌ని ఓ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవ‌డానికి ముంద‌కు వ‌చ్చారు శాస‌న మండ‌లి స‌భ్యులు పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి. చిన్న పేగుకు రంద్రం ప‌డిన ఓ చిన్నారిని ఆదుకోవ‌డానికి పెద్ద మ‌నుసు చేసుకున్నారు. విష‌యం త‌న దృష్టికి వ‌చ్చిన వెంట‌నే త‌గు వైద్యం అందించ‌డానికి అవ‌స‌ర‌మైన సాయం చేయ‌డానికి అంగీక‌రించారు.

ములుగు జిల్లా మంగ‌పేట మండ‌లం మ‌ల్లూరుకు చెందిన గీత కార్మికుడైన జ‌న‌గాని శోభ‌న్ కి కిడ్నీ స‌మ‌స్య ఉంది. దీంతో మ‌కాంని హైద‌రాబాద్ కి మార్చి వీలైన చికిత్స చేయించుకుంటూ దిన‌స‌రి కూలీగా భార్య‌, ఇద్ద‌రు ఆడ‌ పిల్ల‌ల‌తో కుటుంబాన్ని నెట్టుకువస్తున్నాడు. ఈ లోగా ఆయ‌న పెద్ద కూతురు ఆరేళ్లున్న అక్షిత‌కు ఒళ్ళంతా నీరు వ‌చ్చింది. ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్ లో చేర్పిస్తే కిడ్నీ స‌మ‌స్య అంటూ, చికిత్స అందించారు. అప్పు చేసి మూడు ల‌క్ష‌లు క‌ట్టాడు. మ‌ళ్ళీ స‌మ‌స్య తిర‌గ‌బెట్ట‌డంతో నీలోఫ‌ర్ లో చేర్చారు. అక్క‌డా చికిత్స అనంత‌రం డిశ్చార్జీ స‌మ‌యంలో మ‌ళ్ళీ స‌మ‌స్య త‌లెత్తింది. క‌రోనా లాక్ డౌన్ కావ‌డంతో ఇంటికి పంపారు. 

చేసేది లేక సొంతూరు మ‌ల్లూరుకు చేరిన ఆ కుటుంబాన్ని ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఆదుకున్నాయి. కానీ, అక్షిత ఆరోగ్యం మ‌ళ్ళీ క్షీణించి 13 కిలోలున్న ఆ పాప 22 కిలోలకు పెరిగింది. వ‌రంగ‌ల్ ఎంజిఎంలో చికిత్స నిమిత్తం వెళ్ళ‌గా ఆమె చిన్న పేగుకు రంద్రం ప‌డింద‌ని, వెంట‌నే ఆప‌రేష‌న్ చేయాల‌ని ఖ‌ర్చు బాగా అవుతుంద‌ని వైద్యులు చెప్పారు. 

ఒక‌వైపు త‌న‌కు ఆనారోగ్యం, మ‌రోవైపు ప‌సిపిల్ల‌కు తీవ్ర స‌మ‌స్య‌... దీంతో దిక్కుతోచని స్థితిలో ప‌డ్డాడు శోభ‌న్. అక్షిత విష‌యం కాస్తా, టిఆర్ఎస్ యువ‌జ‌న విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, వై.స‌తీశ్ రెడ్డికి తెలిసింది. వెంట‌నే ఆయ‌న ఈ విష‌యాన్ని శాస‌న మండ‌లి స‌భ్యులు పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. 

ఇందుకు స్పందించిన పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి, తాను త‌న సొంత ఖ‌ర్చుల‌తో అక్షిత‌కు వైద్యం చేయించ‌డానికి ముందుకు వ‌చ్చారు. త్వ‌రలోనే డాక్టర్లతో మాట్లాడి, త‌గు ఏర్పాట్లు చేస్తామ‌న్నారు. చిన్నారిని కాపాడ‌డానికి పెద్ద మ‌న‌సు చేసుకున్న శ్రీ‌నివాస‌రెడ్డి ఔదార్యాన్ని ప‌లువురు మెచ్చుకుంటున్నారు. అక్షిత తండ్రి శోభ‌న‌, త‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డికి జీవితాంతం రుణ ప‌డి ఉంటామ‌ని చేతులెత్తి మొక్కుతున్నారు.


logo