శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 14:57:52

'సంధ్య'ను అభినందించిన ఎమ్మెల్సీ క‌విత‌

'సంధ్య'ను అభినందించిన ఎమ్మెల్సీ క‌విత‌

హైద‌రాబాద్ : తొలిసారిగా అండర్‌ గ్రౌండ్‌ మైనింగ్‌లో సెకండ్ క్లాస్ మేనేజర్‌గా సర్టిఫికేట్ సాధించిన యువతి రాసకట్ల సంధ్యను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను సంధ్య గురువారం ఉద‌యం క‌లిశారు. మహిళలకు మైనింగ్ రంగంలో అవకాశాలు కల్పించాలని పార్ల‌మెంట్‌లో కొట్లాడిన ఎమ్మెల్సీ కవితకు సంధ్య‌ కృతజ్ఞతలు తెలిపారు. మైనింగ్ రంగంలో సంధ్య సాధించిన విజయం, ఎంతోమంది మహిళలకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత.  భారతదేశ మైనింగ్ రంగంలో, అండర్ గ్రౌండ్ సెకండ్ క్లాస్ మేనేజర్ గా సర్టిఫికెట్ పొందిన తొలి మహిళగా సంధ్య రాసకట్ల చరిత్ర సృష్టించారు. మన రాష్ట్ర మహిళలు సాధిస్తున్న గొప్ప విజయాలతో, హృదయం గర్వంతో నిండిపోతోంది. మీరు మరిన్ని విజయాలను సాధించాలని ‌కోరుకుంటున్నాను అంటూ క‌విత పేర్కొన్నారు. 

భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రాసకట్ల సంధ్య అండర్‌ గ్రౌండ్‌ మైన్‌లో ఎన్‌సీఎంఎంసీ (సెకండ్‌ క్లాస్‌ మైన్‌ మేనేజ్‌మెంట్‌ కాంపిటెన్సీ) ధ్రువీకరణ పత్రాన్ని పొందిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. బీటెక్‌ మైనింగ్‌ చదివిన సంధ్య రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ (వేదాంత) కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె తండ్రి రఘు సింగరేణి కార్మికుడు.

మహిళలకు మైనింగ్ రంగంలో ప్రాధాన్యత ఇవ్వాలని, ఎంపీగా ఉన్న సమయంలో అనేకసార్లు పార్లమెంటులో ప్రస్తావించారు ఎమ్మెల్సీ కవిత‌. గతంలో సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా పనిచేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో, కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడ్డారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 42 బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా,‌ ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించారు‌.