బుధవారం 03 జూన్ 2020
Telangana - Jan 13, 2020 , 03:54:48

టీఆర్‌ఎస్‌కే ఓటడిగే హక్కు

టీఆర్‌ఎస్‌కే ఓటడిగే హక్కు
  • పుర ఎన్నికల్లోనూ గెలిపించండి: మంత్రి నిరంజన్‌రెడ్డి
  • రాష్ట్రవ్యాప్తంగా ప్రచార హోరు
  • టీఆర్‌ఎస్‌ను ఆదరించండి: మంత్రి గంగుల

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: ఎన్నికలు ఏవైనా గులాబీ పార్టీ గెలుపు ఖాయమని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అన్నివిధాలా అభివృద్ధిపరిచిన టీఆర్‌ఎస్‌కే ఎన్నికల్లో ఓటడిగే హక్కు ఉన్నదని చెప్తున్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధి మరింత పరుగులు పెట్టేందుకు సహకరించాలని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. 


ఉమ్మడి పాలమూరు గులాబీదే: మంత్రి నిరంజన్‌రెడ్డి


ఐదేండ్లలో నిర్విరామంగా పనిచేసి ప్రజల మెప్పు పొందామని, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 17 మున్సిపాలిటీలు గులాబీ ఖాతాలోనే చేరుతాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కు కేవలం టీఆర్‌ఎస్‌కే ఉన్నదని అన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణను వేగంగా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లారని చెప్పారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు హరిశంకర్‌ నాయుడు ఆధ్వర్యంలో పెబ్బేరులో జరిగిన ముఖ్యనాయకులు, కార్యకర్తల విస్తృత సమావేశంలో, వనపర్తిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎమ్మెల్యేలను తిరిగి గెలిపించినట్టుగానే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు.


ప్రతిపక్షాలకు ఓటుతో బుద్ధిచెప్పండి: మంత్రి గంగుల


అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగాలంటే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ను ఆదరించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు. ఆదివారం కరీంనగర్‌ నగరపాలకసంస్థలో ఎన్నికల ప్రచారానికి మంత్రి శ్రీకారం చుట్టారు. ముందుగా నగరంలోని యజ్ఞవరాహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, తర్వాత పలు డివిజన్లలో ప్రచారం చేపట్టారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలకు ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌ను పర్యాటకంగా, ఐటీపరంగా అభివృద్ధి చేసేందుకు అన్నిచర్యలు చేపడుతున్నామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని గంగుల కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.


ప్రచారంలో దూకుడు

రాష్ట్రవ్యాప్తంగా పురపాలక ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి పట్టణంలోని 10వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్తూరి స్వతంత్రభారతి తరపున చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ గడపగడపకూ ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం పథకాలపై అవగాహన కల్పిస్తూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ‘టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించడం మీ బాధ్యత.. చొప్పదండి మున్సిపల్‌ అభివృద్ధి నా బాధ్యత’ అని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే దాసరి విస్తృత ప్రచారం చేపట్టారు. వార్డుల్లో గడపడపకు వెళ్లి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని అభ్యర్థించారు.logo