ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 27, 2020 , 02:27:04

ఆపదలో అండగా

ఆపదలో అండగా

 • సర్కారుకు టీఆర్‌ఎస్‌ స్థానిక నేతల సాయం
 • సీఎంఆర్‌ఎఫ్‌కు 9.5 కోట్ల రూపాయల విరాళం
 • మేయర్లు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రాదేశిక సభ్యులు, సర్పంచ్‌ల నెల వేతనం ప్రకటన
 • మీ ఔదార్యం స్ఫూర్తిదాయకం: ముఖ్యమంత్రి కేసీఆర్‌
 • మేఘా గ్రూప్‌, శాంతాబయోటెక్‌, మీనాక్షి, 
 • లారస్‌ల్యాబ్స్‌, క్రెడాయ్‌ సంస్థల విరాళం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేస్తున్న యత్నాలకు టీఆర్‌ఎస్‌ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మద్దతు పలికారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు ఎదురుకాకుండా సాయం అందించడానికి, వ్యాధివ్యాప్తి నిరోధానికి చేస్తున్న ప్రయత్నాలకు తమవంతుగా ముందుకొచ్చారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నిర్ణయంపై టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎ కేసీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. ఆపద సమయంలో స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు చూపిన ఔదార్యం ఎంతో స్ఫూర్తిదాయకమైనదని అభివర్ణించారు.

 • టీఆర్‌ఎస్‌కు చెందిన మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తమ ఒకనెల గౌరవ వేత నం మొత్తం రూ.9,51,17,500 ముఖ్యమం త్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు అంగీకారపత్రం ఇవ్వనున్నట్టు వారు తెలిపారు.  సీఎం చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలకు స్ఫూర్తిపొంది.. నెల వేతనం ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌కు చెంది న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ ఒకనెల వేతనంతోపాటు, ఏడాది నియోజకవర్గ అభివృద్ధి నిధులు దాదాపు రూ.500 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
 • జీహెచ్‌ఎంసీలో మేయర్‌, డిప్యూటీ మే యర్‌ కలుపుకుని టీఆర్‌ఎస్‌కు 99మంది కార్పొరేటర్లున్నారు. వీరి ఒక నెలవేతనం రూ.6,57,000 సీఎంఆర్‌ఎఫ్‌కు జమచేయనున్నారు. 
 • రాష్ట్రంలో మిగిలిన 12 మున్సిపల్‌ కార్పొరేషన్లలోనూ టీఆర్‌ఎస్‌ మేయర్లు, డిప్యూటీ మేయర్లే ఉన్నారు. వారితో కలిపి 491 మంది కార్పొరేటర్లు పార్టీకి చెందినవారున్నారు. వీరి నెల వేతనం రూ.36,64,000, 114 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్లు, 106 మున్సిపాలిటీలలో వైస్‌చైర్మన్లు, 2,404 మంది కౌన్సిలర్ల వేతనం రూ.84,26,500 సీఎం సహాయ నిధికి జమ చేయనున్నారు. 
 • 32 జెడ్పీలలోనూ టీఆర్‌ఎస్‌ చైర్మన్లు ఉన్నారు. వీరి నెల వేతనం రూ.32 లక్షలు. పార్టీకి చెందిన 449 మంది జెడ్పీటీసీలు (రూ.44.90లక్షలు), 441 మంది ఎంపీపీలు (44.10 లక్షలు) 3,571 మంది ఎంపీటీసీలు (రూ.1,78,55,000), 10,483 మంది సర్పంచ్‌లు (రూ.5,24,15,000) నెల గౌరవ వేతనం మొత్తం కలిపి రూ.8,23,70,000 ముఖ్యమంత్రి సహాయనిధికి అందివ్వనున్నారు. 


మేఘా విరాళం రూ. ఐదు కోట్లు

 • ముఖ్యమంత్రి సహాయనిధికి పలు సంస్థలు, వ్యక్తులు భారీ విరాళాలు ప్రకటించడంతోపాటు.. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు అవసరమైన సామగ్రిని కూడా అందజేస్తున్నారు. మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.5 కోట్ల విరాళం ప్రకటించింది. సంబంధించిన చెక్కును సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు అందజేశారు. 
 • శాంతాబయోటెక్‌ అధినేత వరప్రసాద్‌రెడ్డి వ్యక్తిగతంగా రూ.1,00,00,116 చెక్కు సీఎం కేసీఆర్‌కు అందజేశారు. 
 • కేఎన్నార్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత కామిడి నర్సింహారెడ్డి కోటి రూపాయలకు చెక్కు అందించారు. 
 • లారస్‌ ల్యాబ్స్‌ సీఈవో డాక్టర్‌ సత్యనారాయణ, ఈడీ చంద్రకాంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ల్యాబ్‌ తరపున ఒక లక్ష హైడ్రాక్సి క్లోరోక్విన్‌ టాబ్లెట్లను ఉచితంగా అందిస్తామని తెలిపారు. అలాగే సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.50 లక్షల చెక్కు ఇచ్చారు.
 • హైదరాబాద్‌కు చెందిన మీనాక్షి గ్రూప్‌ చైర్మన్‌ కేఎస్‌రావు, ఎండీ సీ శివాజీ.. సీఎమ్మారెఫ్‌కు రూ.కోటి చెక్కును ప్రగతిభవన్‌లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.
 • క్రెడాయ్‌ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు రూ.కోటి విరాళం అందించారు. 
 • జీపీకే ఎక్స్‌పోర్ట్‌ అండ్‌ ఇంపోర్ట్‌ యజమానులు ఫణికుమార్‌, కర్నాల శైలజారెడ్డి వైద్యులకోసం 4వేల ఎన్‌95 మాస్క్‌లను కేటీఆర్‌కు అందజేశారు.logo