మంగళవారం 26 మే 2020
Telangana - Mar 26, 2020 , 02:16:10

టీఆర్‌ఎస్‌ చట్టసభల సభ్యుల భారీ విరాళం

టీఆర్‌ఎస్‌ చట్టసభల సభ్యుల భారీ విరాళం

  • కరోనాపై పోరుకు సీఎమ్మార్‌ఎఫ్‌కు రూ.500 కోట్లు! 
  • ముఖ్యమంత్రి సహాయనిధికి వెల్లువలా విరాళాలు 
  • టీఆర్‌ఎస్‌ చట్టసభల సభ్యుల భారీ విరాళం
  • ఏడాది నియోజకవర్గ అభివృద్ధి నిధులు, నెలజీతం ప్రకటించిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్‌ ప్రకటించిన యుద్ధానికి టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆర్థికంగా మద్దతు పలికారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు ఎదురుకాకుండా సాయం అందించడానికి, కరోనా కట్టడికి తమవంతుగా ముందుకొచ్చారు. ఒకనెల వేతనం, ఏడాది నియోజకవర్గాల అభివృద్ధి నిధులు మొత్తం దాదాపు రూ.500కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాలని నిర్ణయించారు. ఒక్కో ఎంపీకి నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఏడాదికి ఐదుకోట్లు మంజూరవుతాయి. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు 16 మందికి మంజూరయ్యే మొత్తం రూ.80 కోట్లు సీఎంసహాయనిధికి అందించనున్నారు. 

ఒకనెల జీతం కూడా ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన కాన్సెంట్‌ లెటర్‌ను టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, ఉపనాయకుడు బండ ప్రకాశ్‌, లోక్‌సభలో పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు, ఉప నాయకుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమం త్రి కే చంద్రశేఖర్‌రావుకు అందజేశారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ఎంపీలు రంజిత్‌రెడ్డి, ఎం శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్‌, మాలోతు కవిత పాల్గొన్నారు. ప్రధానమంత్రి సహాయనిధికి కూడా పార్టీ ఎంపీల ఒకనెల జీతాన్ని అందజేయనున్నట్టు  కే కేశవరావు తెలిపారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులుసహా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఏడా ది నియోజకవర్గ అభివృద్ధి నిధులతోపాటు, ఒకనెల జీతాన్ని సీఎంఆర్‌ఎఫ్‌కు ఇవ్వనున్నట్టు టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం ప్రకటించింది. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి నియోజకవర్గ అభివృద్ధికి ఏడాది రూ.3 కోట్లు విడుదలవుతాయి. కరోనా కట్టడి చర్యల కోసం తమ నియోజకవర్గాల నిధులు, జీతాలను కేటాయించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్‌ అభినందించారు. చట్టసభల సభ్యులు చూపించిన స్ఫూర్తి ప్రభుత్వానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని ప్రకటించారు. 

కడియం విరాళం రూ.5 లక్షలు 

కరోనాపై పోరు కోసం సీఎం సహాయనిధికి తనవంతుగా రెండునెలల వేతనం రూ.5లక్షలు ఇవ్వనున్నట్టు మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రకటించారు. కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ సీహెచ్‌ రాజేశ్వర్‌రావు.. కలెక్టర్‌ కే శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ రూ.10 లక్షల చెక్కును అందజేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని 26 గ్రామాల సర్పంచ్‌లు ఒకనెల గౌరవ వేతనం రూ.1.30 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించారు. అంగీకార పత్రాన్ని  కలెక్టర్‌కు అందించాలని కోరుతూ రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డికి సర్పంచ్‌ల ఫోరం మం డల అధ్యక్షుడు గంగం సతీశ్‌రెడ్డి అందజేశారు.

రైతు విరాళం రూ.50 వేలు

ఆదిలాబాద్‌ రూరల్‌: ఆదిలాబాద్‌ మండలం లాండసాంగ్వి గ్రామానికి చెందిన రైతు మోర హన్మాండ్లు సీఎం సహాయనిధికి రూ.50 వేల విరాళం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును బుధవారం జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన, ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌కు అందజేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఈ విరాళాన్ని ఉపయోగించాలని హన్మాండ్లు కోరారు. ‘నాకున్న నాలుగున్నరెకరాల పొలంలో ఈ ఏడాది పంట కూడా బాగానే పండింది. ఇటీవలే పంటకు సంబంధించిన డబ్బులు వచ్చాయి. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో పేదలకు తినడానికి తిండి దొరకడం లేదనే విషయం తెలిసింది. నా కుమారులు, నేను పేదలసాయం కోసం రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. కొంతమందినైనా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ మొత్తం ఇచ్చాం’ అని రైతు చెప్పారు.

కరోనా కట్టడికి కఠిన చర్యలు

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో కఠినంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆదేశించారు. వరంగల్‌ జిల్లాలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న దయాకర్‌రావుకు సీఎం కేసీఆర్‌ బుధవారం ఫోన్‌చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు చెప్పి పలు అంశాలపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు అందుతున్నాయా? ఇంకా నీటి అవసరం ఎంత ఉన్నదనే విషయాలను సీఎం కేసీఆర్‌ అడిగి తెలుసుకొన్నారు. ఇంకా 15 రోజులు కాళేశ్వరం నీటిని పాలకుర్తి నియోజకవర్గానికి ఇవ్వాలని, మరో తడికి నీరిస్తే మక్కజొన్న పంట చేతికి వస్తుందని మంత్రి ఎర్రబెల్లి కోరారు. 

కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకొంటున్న చర్యలను సీఎంకు వివరించారు. ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, రోజువారీగా పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు చెప్పారు. ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు చేపట్టామని, ఎంజీఎంతోపాటు జనగామ, మానుకోట, భూపాలపల్లి, ములుగు దవాఖానల్లో అవసరమైన ఏర్పాట్లు చేశామని సీఎంకు వివరించారు. వరంగల్‌ ఎంజీఎంకు కరోనా పరీక్షలు చేసే ల్యాబ్‌ను మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కరోనా నియంత్రణలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలను చైతన్యపర్చాలని, సమన్వయంతో పనిచేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.


logo