సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Feb 26, 2020 , 04:34:05

డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా

డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా
  • డీసీసీబీలలో 147 డైరెక్టర్లు
  • డీసీఎంఎస్‌లలో 74 డైరెక్టర్లు ఏకగ్రీవంఒక్కటి మినహా అన్నీ టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల కైవసం
  • 29న ఆఫీస్‌ బేరర్ల ఎన్నిక

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:రాష్ట్రంలోని తొమ్మిది జిల్లా కేంద్ర సహకారబ్యాంకు (డీసీసీబీ)లు, తొమ్మిది జిల్లా కో- ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సంస్థ (డీసీఎంఎస్‌)ల డైరెక్టర్ల పదవులన్నీ ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర సహకారశాఖ ఎన్నికల అథారిటీ ప్రకటించింది. ఇందులో నల్లగొండ జిల్లాలో ఒక్కస్థానం మినహా మిగిలిన అన్ని డైరెక్టర్‌ పదవులు టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకే దక్కాయి. ఒక్కొక్క డీసీసీబీలో 20 (గ్రూప్‌ ఏలో 16, గ్రూప్‌ బీలో 4), ఒక్కొక్క డీసీఎంస్‌లో 10 చొప్పున డైరెక్టర్‌ పదవుల భర్తీకి మంగళవారం ఉదయం నోటిఫికేషన్‌ విడుదలచేసి, నామినేషన్లు స్వీకరించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్లు స్వీకరించిన అధికారులు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపసంహరణకు అవకాశమిచ్చారు. 


కొన్నిచోట్ల డైరెక్టర్‌ పదవికి ఇద్దరు ముగ్గురు నామినేషన్లు వేసినప్పటికీ, ఉపసంహరణ గడువు ముగిసేసరికి అన్నిచోట్లా ఒక్కొక్కరే  పోటీలో మిగిలారు. తొమ్మిది డీసీసీబీలలో మొత్తం 180 డైరెక్టర్‌ పదవులుండగా, 147 పదవులకు ఒక్కొక్క నామినేషనే దాఖలైంది. రిజర్వేషన్‌ క్యాటగిరీలోని మరో 33 డైరెక్టర్‌ పదవులకు అభ్యర్థులు  లేకపోవడంతో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలుకాలేదు. దీంతో డీసీసీబీలలో 147 డైరెక్టర్‌ పదవులు ఏకగ్రీవమైనట్టు అధికారులు వెల్లడించారు.  తొమ్మిది డీసీఎంఎస్‌లలోని మొత్తం 90 డైరెక్టర్‌ పోస్టులకు నామినేషన్లు స్వీకరించగా 74 పోస్టులకు ఒక్కొక్కరే నామినేషన్‌ దాఖలుచేశారు. రిజర్వేషన్‌ క్యాటగిరీలోని మరో 16 డైరెక్టర్‌పదవులకు ఆయా అభ్యర్థులు లేకపోవడంతో ఒక్క నామిషనేషన్‌ కూడా దాఖలుకాలేదు. దీంతో డీసీఎంఎస్‌లలో 74 డైరెక్టర్‌ పదవులు ఏకగ్రీవమైనట్టు అధికారులు ప్రకటించారు. 


29న ఆఫీస్‌ బేరర్ల ఎన్నిక

డీసీసీబీ, డీసీఎంఎస్‌లలో ఆఫీస్‌బేరర్లు,  చైర్మన్లు, వైస్‌చైర్మన్ల పదవుల భర్తీకి ఈ నెల 29వ తేదీన నోటిఫికేషన్‌ విడుదలచేసి, అదేరోజు ఎన్నిక నిర్వహించనున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నిర్వహించిన ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడంతో డీసీసీబీ, డీసీఎంఎస్‌ల డైరెక్టర్‌ పదవులను ఆ పార్టీ ఏకపక్షంగా గెలుచుకున్నది. డైరెక్టర్‌ పదవులు ఏకగ్రీవం కావడంలో సంబంధిత జిల్లా మంత్రి, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రచించిన వ్యూహాలు ఫలించాయి. కేవలం నల్లగొండ  జిల్లాలో మాత్రమే ఒకేఒక్క డైరెక్టర్‌ స్థానం కాంగ్రెస్‌పార్టీకి దక్కింది. తొమ్మిది డీసీసీబీలలోని మొత్తం 33 రిజర్వ్‌డ్‌ స్థానాల్లో  (ఆదిలాబాద్‌ -2, కరీంనగర్‌ -3, నిజామాబాద్‌ - 4, నల్లగొండ -3, ఖమ్మం- 4, మహబూబ్‌నగర్‌  -5, వరంగల్‌ -3, రంగారెడ్డి - 6, మెదక్‌  3) ఒక్క నామినేషన్‌ కూడా దాఖలుకాలేదని అధికారులు వివరించారు. ఆయా డైరెక్టర్ల ఎన్నికలను వాయిదావేసినట్టు ప్రకటించారు.