గురువారం 28 మే 2020
Telangana - May 01, 2020 , 01:48:43

ప్రభుత్వంపై దుష్ప్రచారం తగదు

ప్రభుత్వంపై దుష్ప్రచారం తగదు

  • విపక్షాలపై రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ఆగ్రహం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతులకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనితీరును ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. కరోనా విజృంభిస్తున్న క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంటలను పూర్తిగా వారి పొలాల వద్దే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న విషయం ప్రతిపక్ష నాయకుల కండ్లకు కనిపించడంలేదా అని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో పంటలను పూర్తిగా కొనుగోలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌ రైతులు తమ పంటలను క్వింటాలు రూ.వెయ్యికే అమ్మడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇలాంటి విపత్కర సమయంలో తెలంగాణ తప్ప దేశంలోని మరే రాష్ట్రం పంటలను కొనడంలేదన్నారు. తెలంగాణ రైతులు సంతోషంగా ఉంటే ప్రతిపక్ష నాయకులు సహించలేకపోతున్నారని, కుళ్లు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కండ్లున్న కబోదులని, వారిది మొసలి కన్నీరే తప్ప రైతుల పట్ల ఎలాంటి గౌరవం లేదన్నారు. మార్కెట్‌లో ఎదురవుతున్న చిన్న సమస్యలను భూతద్దంలో చూపడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. రాష్ట్రంలోని లక్షల మంది రైతులు పండించిన వివిధ పంటల ఉత్పత్తులను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనడం దేశంలో ఎక్కడాలేదన్నారు. విపక్ష నేతలకు చిత్తశుద్ధి ఉంటే వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రైతుల నుంచి కనీస మద్దతు ధరకే పంటలు కొనుగోలు చేసేలా చూడాలని హితవుపలికారు. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా రాష్ట్రంలో రైతులు 40 లక్షల ఎకరాల్లో వరి ధాన్యాన్ని పండించి రికార్డు సృష్టించారని తెలిపారు. రైతులకు చేదోడువాదోడుగా ఉంటున్న సీఎం కేసీఆర్‌ను అభినందించాల్సిందిపోయి విమర్శలు చేయడం తగదన్నారు.


logo