ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 16:42:06

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌విత గెలుపు ఖాయం : కేటీఆర్

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌విత గెలుపు ఖాయం : కేటీఆర్

హైద‌రాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ క‌విత‌ విజయం ఖాయమ‌ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విశ్వాసం వ్య‌క్తం చేశారు. భారీ మెజార్టీతో క‌విత‌ను గెలిపించాల‌ని పార్టీ ప్ర‌తినిధుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు విన్న‌వించారు. త్వ‌ర‌లోనే జ‌రిగే ఈ ఎన్నిక‌పై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీకి నిజామాబాద్ జిల్లా అండ‌గా నిలుస్తున్న‌ద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. అన్ని ఎన్నికల్లో విజయం సాధించినట్టే ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి నిజామాబాద్ మరోసారి అండగా నిలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొన్ని దుష్ట శక్తులు రాజకీయాలు చేస్తున్నాయి. కులాలు మతాల పేరిట చిచ్చు పెట్టే వారిని ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ ఎదుర్కొంటుంది అని కేటీఆర్ తేల్చిచెప్పారు. 

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం

ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పునరుజ్జీవన కార్యక్రమం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ప్రభుత్వం టిఆర్ఎస్ అని  కేటీఆర్ అన్నారు. దీంతోపాటు కాలువల ఆధునికీకరణ,  పూర్వ నిజామాబాద్  జిల్లాలో ప్రాంతాలైన కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా త్వరలోనే నీళ్లు వస్తాయని కేటీఆర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఉన్న వ్యవసాయ రంగ ఉత్పత్తులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేసి జిల్లాలోని యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను వ్యతిరేకించిన టిఆర్ఎస్ పార్టీ నీ అంతే స్థాయిలో విద్యుత్ సంస్కరణల పేరిట రైతులకు ఉచిత విద్యుత్ కి ప్రమాదం తీసుకువచ్చే కార్యక్రమాన్ని కూడా వ్యతిరేకిస్తోందని తెలిపారు. రైతు సంక్షేమం కోసం అవసరమైతే దేవునితో పోరాడుతాం అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ముందుకు పోతున్నామని తెలిపారు. 

మున్సిపాలిటీల‌కు ప్ర‌త్యేక నిధులు ఇస్తున్నాం

ఎంపీటీసీ, జడ్పిటిసిలకు ప్రత్యేక నిధుల విషయంలో ఉన్న సమస్యలను తమ ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది, ఇందుకు సంబంధించి ఒక పరిష్కారంతో ముందుకువస్తున్నదని అన్నారు. దీంతోపాటు కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్ల సమస్యలు సైతం తమకు తెలుసని మునిసిపాలిటీలకు ప్రత్యేక నిధులు ఇచ్చి, తమ తమ వార్డుల్లో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగేలా చూస్తున్నామని తెలిపారు. ఇలా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్న తమ ప్రభుత్వ పనితీరుని అర్థం చేసుకొని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆశీర్వాదంతో రానున్న ఎన్నికల్లో కవిత ఎమ్మెల్సీగా ఎన్నికైన వస్తుందన్న నమ్మకం తనకు ఉన్నదని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.


logo