గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 03:32:04

దళితుల పేరిట రాద్ధాంతం

దళితుల పేరిట రాద్ధాంతం

  • వ్యక్తిగత లొల్లిని టీఆర్‌ఎస్‌కు ఆపాదిస్తారా? 
  • కాంగ్రెస్‌ నాయకులపై మంత్రి కొప్పుల మండిపాటు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో దళితుల మరణాలతో టీఆర్‌ఎస్‌కు సంబంధం లేదని, వాటిని తమ పార్టీకి అంటగడుతూ కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మండిపడ్డారు. ఆ ఘటనల్లో ఎక్కడా రాజకీయ ప్రమేయం లేదని.. ఒక గ్రామంలో వ్యక్తిగత విభేదాలతో జరిగిన గొడవలపై కాంగ్రెస్‌ స్పందించడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియాపాయింట్‌ వద్ద పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధుతో కలిసి కొప్పుల మాట్లాడారు. రెండునెలలుగా మంథని కేంద్రంగా కాంగ్రెస్‌ రాద్ధాంతం చేస్తున్నదని ఆరోపించా రు. రాష్ట్రంలో దళితుల మరణాలపై ఎక్కడా స్పందించని ఆ పార్టీ నాయకులు, మంథనిలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ‘చలో మల్లారం’లో కాం గ్రెస్‌ నాయకులకు ఆ గ్రామానికి వెళ్లిఉంటే నిజాలు తెలిసుండేవని అన్నారు. ఆ ఘటనలు పూర్తిగా  కుటుంబాలకు సంబంధించినదని స్పష్టంచేశారు. దళితుల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటికే 15 వేల ఎకరాలు పంపిణీచేసిందని, మూడెకరాల భూ పంపిణీ నిరంతరం కొనసాగే కార్యక్రమమని పేర్కొన్నారు. పెద్దపల్లి జెడ్పీచైర్మన్‌ పుట్ట మధు మాట్లాడుతూ.. మంథనిలో ఇద్దరిమధ్య జరిగిన చిన్నగొడవను కాంగ్రెస్‌ భూతద్దంలో చూపిస్తున్నదని విమర్శించారు. రంగయ్య అనే టీఆర్‌ఎస్‌ కార్యకర్త మరణిస్తే కాంగ్రెస్‌కి ఏమి సంబంధమో అర్థం కావడంలేదని అన్నారు. పక్కపక్క ఇండ్లలో ఉండేవారి మధ్య గొడవల్లో ఒకరు మరణించారని, ఇలాంటి ఘటనలు దేశంలో ఎక్క డాజరుగలేదన్నట్టు కాంగ్రెస్‌ ప్రవర్తిస్తున్నదని మండిపడ్డారు. భట్టివిక్రమార్కలాంటి నేత సైతం కొందరు చెప్పినవి విని మాట్లాడటం సరికాదని హితవుపలికారు.


logo