బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:52:19

తెలంగాణకో నీతి.. ఏపీకో రీతి!

తెలంగాణకో నీతి.. ఏపీకో రీతి!

  • ఏపీ ఫిర్యాదుపై ఆగమేఘాల మీద కృష్ణా బోర్డు స్పందన
  • శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి నిలిపేయాలని తెలంగాణకు లేఖ
  • ‘రాయలసీమ’ టెండర్లు పిలిచినా పట్టని బోర్డు అధికారులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కృష్ణానదీ యాజమాన్యబోర్డు తెలంగాణ, ఏపీల మధ్య భిన్నవైఖరిని అవలంబిస్తున్నది. ఏపీ చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేంద్రం ఆదేశాల అమలును పట్టించుకోని కృష్ణాబోర్డు.. ఏపీ చిన్నఅంశంపై చేసిన ఫిర్యాదుపై ఆగమేఘాల మీద స్పందించిం ది. తెలంగాణ ఫిర్యాదుమేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ ముందుకుపోకుం డా నిలువరించాలంటూ కేంద్రజల్‌శక్తి కృష్ణాబోర్డును ఆదేశించింది. దీనిపై బోర్డు గతంలోనే ఏపీకి లిఖితపూర్వకంగా ఆదేశాలిచ్చింది. గత నెల 4న జరిగిన బోర్డు సమావేశంలోనూ చైర్మన్‌ స్వయంగా ఏపీ అధికారులకు స్పష్టంచేశారు. ఇందుకుభిన్నంగా ఏపీ సోమవారం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. శ్రీశైలం ఫోర్‌షోర్‌లో సంగమేశ్వర పా యింట్‌ వద్ద రోజుకు మూడు టీఎంసీల నీ టిని ఎత్తిపోసేందుకుగాను ఎత్తిపోతల పథకా న్ని చేపట్టేందుకు 3,278.19 కోట్లతో టెం డర్లు పిలిచింది. ఈ సమాచారం తెలిసినా బోర్డు ఏమాత్రం స్పందించలేదు. 

చిన్న అంశంపై పెద్ద హడావుడి

కీలకమైన అంశాలనే గాలికొదిలేసే కృష్ణాబోర్డు చిన్నఅశంపై హడావుడి చేయడం చిత్రంగా ఉన్నది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా తెలంగాణ కరెంటు ఉత్పత్తి చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నదంటూ ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి ఆదివారం రాత్రి వాట్సాప్‌ ద్వారా బోర్డుకు ఫిర్యాదుచేశారు. సోమవారం ఉదయం నుంచే దీనిపై హడావుడి చేసిన బోర్డు అధికారులు.. వెంటనే కరెంటు ఉత్పత్తిని నిలిపివేయాలంటూ తెలంగాణ అధికారులకు మౌఖికఆదేశాలు జారీచేశారు. తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు ఎస్‌ఈ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో..బోర్డు కూడా తెలంగాణకు లిఖితపూర్వకంగా ఆదేశాలిచ్చింది. ఏపీ ఫిర్యాదుపై ఆగమేఘాల మీద స్పందించిన బోర్డు.. తెలంగాణ ఫిర్యాదు, అందునా కేంద్ర జల్‌శక్తి ఆదేశాల అమలును విస్మరించడం చర్చనీయాంశంగా మారింది.logo