బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 01:20:49

ఢిల్లీలో తెలంగాణ జయపతాక

ఢిల్లీలో తెలంగాణ జయపతాక

  • ఆకాశమంత ఎత్తున మన ఆత్మగౌరవ పతాకం
  • వసంతవిహార్‌లో టీఆర్‌ఎస్‌ కార్యాలయ నిర్మాణం
  • 1327 గజాల భూమిని అప్పగించిన కేంద్ర ప్రభుత్వం
  • పత్రాలను స్వీకరించిన రాష్ట్ర మంత్రి వేముల
  • త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతులమీదుగా భూమిపూజ

సరిగ్గా ఇరవై ఏండ్ల క్రితం జలదృశ్యం నుంచి ఒక్కడి అడుగుతో ప్రారంభమైన ప్రస్థానం.. ఢిల్లీలో జయపతాకను ఎగురవేయబోతున్నది. ఒకప్పుడు ఏ అస్తిత్వం కోసం ఢిల్లీ వీధుల్లో తెలంగాణ సమాజపు గుండె చప్పుళ్లు ప్రతిధ్వనించాయో.. ఇప్పుడు అవే వీధుల్లో మన ఆత్మగౌరవ పతాకం ఆకాశమంత ఎత్తు ఎగురబోతున్నది. తెలంగాణే ఊపిరిగా రెండు దశాబ్దాలపాటు ప్రస్థానం సాగించిన తెలంగాణ రాష్ట్రసమితి చరిత్రలో మరో కీలక మైలురాయి పడింది. టీఆర్‌ఎస్‌ కార్యాలయ నిర్మాణానికి త్వరలో పునాదిరాయి పడనున్నది. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షల ప్రతిరూపమైన గులాబీ జెండా ఢిల్లీలో రెపరెపలాడనున్నది. ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి కేటాయించిన స్థలం అప్పగింత బుధవారం పూర్తయింది. ఇందుకోసం కేంద్రం నిర్దేశించిన రూ.8.64 కోట్లు ఒక ప్రాంతీయ పార్టీకి భారమే అయినప్పటికీ, దేశ రాజధానిలో తెలంగాణ ఉద్యమ విజయాన్ని ఇతర రాష్ర్టాలకు స్ఫూర్తిగా చాటిచెప్పేందుకు.. ఆ మొత్తాన్ని చెల్లించి భూమి పత్రాలను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్వీకరించారు. యావత్‌ తెలంగాణ సమాజపు ఏకాత్మ రూపానికి ఇది ప్రతీక. కార్యాలయ నిర్మాణానికి త్వరలోనే సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేయబోతున్నారు.    


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయ నిర్మాణం కోసం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కేటాయించిన 1100 చదరపు మీటర్ల భూమి (1,327 గజాలు)  అప్పగింత పని పూర్తయింది. వసంత్‌విహార్‌లోని 2, 6 నంబర్లలోని ప్లాట్ల పత్రా లను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ల్యాండ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీస్‌ జేఈ సుమిత్‌ కుమార్‌.. టీఆర్‌ఎస్‌ ప్రతినిధి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి అప్పగిం చారు. 15 మంది ఎంపీల కంటే ఎక్కువగా ఉన్న పార్టీలకు.. ఢిల్లీలో కార్యాలయాల నిర్మాణానికి 1000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ  స్థలాన్ని కేటాయిస్తారు. ఈక్రమంలోనే పార్టీ కార్యాలయం కోసం స్థలాన్ని కేటాయించాలని టీఆర్‌ఎస్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో గత అక్ట్టోబర్‌ 9న స్థలాన్ని కేటాయిస్తూ టీఆర్‌ఎస్‌కు సమాచారమిచ్చింది. కేంద్రం నిర్దేశించిన మేర కు రూ.8.64 కోట్లు చెల్లించడంతో బుధవారం ఉద యం హద్దులను చూపించి స్థలాన్ని అప్పగించారు.  

దేశ రాజకీయాలను ప్రభావితంచేసే స్థాయికి

జలదృశ్యంలో ఒక వ్యక్తి నడకతో మొదలైన టీఆర్‌ఎస్‌ ప్రస్థానం ప్రత్యేక తెలంగాణ పోరాటంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. టీఆర్‌ఎస్‌ తన పోరాటపటిమతో కేంద్రం మెడలు వంచి అసాధ్యమనుకొన్న తెలంగాణను సుసాధ్యం చేసింది. ఇప్పుడు  దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాజకీయ ఆత్మగౌరవ జెండాను రెపరెపలాడించేందుకు సిద్ధమైంది. తెలంగాణకు నవ వసంతాలు మోసుకొచ్చిన గులాబీ జెండా ఢిల్లీలో వినువీధిలో ఎగురనున్నది.  

ఆత్మగౌరవ ప్రతీక

ఇరవై ఏండ్ల క్రితం ఒక్కరితో మొదలైన తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ ఆత్మగౌరవ పతాకం ఎగురవేసే స్థాయికి ఎదిగిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.  సీఎం కృషి ఫలితంగానే టీఆర్‌ఎస్‌కు త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో గొప్ప కార్యాలయం నిర్మాణం కానున్నదని చెప్పారు. ఇది పార్టీ నాయకులకు, కార్యకర్తలకు , తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని తెలిపారు. ఇంతటి మహోన్నత ఘట్టంలో తనను భాగస్వామ్యం చేసినందుకు ఆయన సీఎం కేసీఆర్‌కు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేస్తారని పేర్కొన్నారు.