ఆదివారం 31 మే 2020
Telangana - May 14, 2020 , 15:26:54

పోతిరెడ్డిపాడుపై న్యాయ పోరాటం చేస్తాం

పోతిరెడ్డిపాడుపై న్యాయ పోరాటం చేస్తాం

హైదరాబాద్‌ : పోతిరెడ్డిపాడుపై న్యాయ పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రయోజనాల విషయంలో సీఎం కేసీఆర్‌ రాజీపడరు అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు. అక్రమంగా కట్టే ప్రాజెక్టులను అడ్డుకునే బాధ్యత కేంద్రానికి లేదా? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు కడుతోందని మంత్రి పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ పక్క రాష్ర్టాల సీఎంలతో మాట్లాడి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారని మంత్రి తెలిపారు. పక్క రాష్ర్టాన్ని సంప్రదించాలన్న ఆలోచన ఏపీకి ఉండాలన్నారు. ఏపీ తెచ్చిన 203 జీవోతో ప్రతిపక్షాలు కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణకు అన్యాయం చేసే ప్రాజెక్టులకు ఆనాడు కాంగ్రెస్‌ నాయకులు హారతులు పట్టారు. పోతిరెడ్డిపాడుకు సహకరించిందే తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులే అని మంత్రి ధ్వజమెత్తారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకోకుంటే అది ఎప్పుడో పూర్తయ్యేది అని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలో నిర్మించే ప్రతి ప్రాజెక్టు రోల్‌ మోడల్‌గా ఉంటోందన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే సీఎం కేసీఆర్‌ ఊరుకోరని స్పష్టం చేశారు. నాలుగు రాష్ర్టాలను బతికించే స్థాయికి తెలంగాణ ఎదిగిందని ఆయన తెలిపారు. గోదావరి నీటిని కృష్ణాకు మళ్లిద్దామని చెప్పిందే సీఎం కేసీఆర్‌ అని తెలిపారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆనాడు టీఆర్‌ఎస్‌ మంత్రులు రాజీనామా చేసిన విషయాన్ని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ గుర్తు చేశారు.


logo