బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:32:09

లక్ష ఉద్యోగాల భర్తీ

లక్ష ఉద్యోగాల భర్తీ

  • నియామకాల్లో తెలంగాణ రికార్డు
  • టీఎస్‌పీఎస్సీ ద్వారా 30 వేల కొలువులు
  • ఇతరశాఖల నుంచి మరో 70 వేల ఉద్యోగాల భర్తీ
  • ఉమ్మడి ఏపీలో చివరి పదేండ్లలో 24 వేల ఉద్యోగాలే
  • జోనల్‌ వ్యవస్థతో ఉద్యోగార్థులకు మరింత లబ్ధి

ఉమ్మడి ఏపీలో అమల్లోఉన్న నాన్‌లోకల్‌ విధానాన్ని రద్దుచేసి తెలంగాణ ప్రభుత్వం వందశాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చర్యలు చేపట్టింది. ఇందులోనే జోన్ల వ్యవస్థను కూడా మార్చారు. రాష్ట్రంలో గతంలో రెండుజోన్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఏడు జోన్లుగా విభజన జరిగింది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నీళ్లు, నిధులు, నియామకాలు నినాదాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని రూపుమాపేందుకు లక్షా 7వేల ఉద్యోగాలు భర్తీచేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలిశాసనసభా సమావేశాల్లోనే ప్రకటించారు. ఈ ఆరేండ్లలో అందుకనుగుణంగానే కార్యాచరణ జరిగింది. ఇప్పటివరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ), ఇతర రిక్రూట్‌మెంట్‌ బోర్డుల ద్వారా దాదాపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయడంతోపాటు, భర్తీ ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తిచేశారు. ఇందులో టీఎస్‌పీఎస్సీ నుంచి భర్తీ అయినవే 30వేల పోస్టుల దాకా ఉన్నాయి. కోర్టు కేసులు, ఇతర అవరోధాలను అధిగమించి భర్తీ ప్రక్రియను చేపట్టిన టీఎస్‌పీఎస్సీ ఇతర రాష్ర్టాల్లో పీఎస్సీలకు మార్గదర్శకంగా నిలిచింది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ప్రముఖ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ప్రభుత్వం గతంలో ఎన్నడూ రిక్రూట్‌ చేయని పోస్టులను సైతం భర్తీచేసింది.

సవాళ్లను అధిగమించి స‘లక్ష’ణంగా..

ఉమ్మడిరాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురైన తెలంగాణలో ఉద్యోగాల కల్పనపై అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధరంగాలకు సంబంధించి దాదాపు లక్ష ఉద్యోగాల భర్తీకి వివిధ దశల్లో ఆర్థికశాఖ అనుమతులు కూడా ఇచ్చింది. ఇందులో టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సినవి 40 వేలు ఉన్నాయి. 2014 డిసెంబర్‌ 18న నూతనంగా ఏర్పడిన టీఎస్‌పీఎస్సీకి ఇది సవాల్‌గా మారింది. కమిషన్‌ ఏర్పడగానే పని ప్రారంభం కాలేదు. సిలబస్‌ ఫ్రేమ్‌ చేసుకోవడం, సర్వీస్‌ రూల్స్‌ మార్చుకోవడం, స్టాఫ్‌ను సిద్ధం చేసుకొనేందుకు ఐదు నుంచి ఆరు నెలలు పట్టింది. అలా మొదటి నోటిఫికేషన్‌ 2015 ఆగస్టులో విడుదలైంది. అప్పట్నుంచి ఇప్పటివరకు మొత్తం 105 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 36,643 ఖాళీలకుగాను 29,091 పోస్టులు భర్తీచేశారు. 5,916 పోస్టులకు సంబంధించి కోర్టులో స్టే ఉన్నది. మరో 1,636 పోస్టుల భర్తీ చివరి దశలో ఉన్నది.


పెండింగ్‌లో ఉన్నవి 4 వేలు

రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా జోనల్‌ వ్యవస్థలో మార్పుచేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరువ తీసుకున్నారు. దీనిద్వారా 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాయి. ఆయాశాఖలు కొత్త ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్స్‌కు అనుగుణంగా నిబంధలను మార్చుకుని.. తర్వాత ఉద్యోగుల వివరాలు ఇవ్వాల్సి వచ్చింది. ఇందుకోసం జాప్యం ఏర్పడిన కారణంగా 4వేల పోస్టుల భర్తీ ఆగిపోయింది. అది తప్ప టీఎస్‌పీఎస్సీకి కేటాయించిన 40 వేలల్లో 30 వేల పోస్టులు భర్తీ అయ్యాయి. మరో ఆరువేల పోస్టులు కోర్టు కేసుల కారణంగా పెండింగ్‌లో ఉండగా, 1,636 పోస్టుల ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఇంత పెద్దసంఖ్యలో ఉద్యోగాల భర్తీ గతంలో ఎన్నడూ జరుగలేదు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలోని 23 జిల్లాల్లో భర్తీ అయినవి 24,086 ఉద్యోగాలు మాత్రమే. అందులోనూ తెలంగాణ ఉద్యమ తీవ్రతతో చివరి రెండేండ్లలోనే 11 వేలు భర్తీచేశారు. 

ఇతరబోర్డుల నుంచి బోలెడన్ని ఉద్యోగాలు

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ రెండువిధాలుగా జరుగుతుంది. టీఎస్‌పీఎస్సీ ద్వారా కొన్ని ఉద్యోగ నియామకాలు జరిగితే.. వివిధ బోర్డులు మరిన్ని ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ చేపడుతాయి. ఎలక్ట్రిసిటీ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌, పంచాయతీ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌, మెడికల్‌ హెల్త్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌, గురుకులాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్‌ బోర్డులు వేర్వేరుగా ఉద్యోగాల భర్తీని చేపడుతాయి. వీటికితోడు సింగరేణి, ఆర్టీసీ వంటి కార్పొరేషన్లలో అదనపు కొలువుల భర్తీ ఉంటుంది. ఇలా అన్నిబోర్డులు కలిపి ఆరేండ్లలో 70వేల పోస్టులను భర్తీచేశాయి. విద్యుత్‌సంస్థల్లో 20 వేల ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఈ అన్ని పోస్టులకు అదనం. 

జోనల్‌ వ్యవస్థతో మరింత ప్రయోజనం

ఉమ్మడి ఏపీలో అమల్లోఉన్న నాన్‌లోకల్‌ విధానాన్ని రద్దుచేసి తెలంగాణ ప్రభుత్వం వందశాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చర్యలు చేపట్టింది. ఇందులోనే జోన్ల వ్యవస్థను కూడా మార్చారు. రాష్ట్రంలో గతంలో రెండుజోన్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఏడు జోన్లుగా విభజన జరిగింది. ఉద్యోగ నోటిఫికేషన్‌ వెలువడగానే కేసులమీద కేసులు వేయడం పరిపాటిగా మారింది. కానీ, ఇందులో ఉద్యోగ ప్రక్రియను తప్పుపడుతూ ఒక్కకేసు కూడా లేకపోవడం గమనార్హం. 105 నోటిఫికేషన్లలో ప్రస్తుతం కోర్టుస్టేలు ఉన్న కేసులు మూడు.. నాలుగు మాత్రమే. పారామెడికల్‌, కొన్ని టీచర్‌పోస్టులపై కేసులతో ఆయా పోస్టులు పెండింగ్‌లో ఉన్నాయి. 

ప్రత్యేక రాష్ట్రంలో నోటిఫికేషన్లు

ఏడాది
పోస్టులు
2015
3553
2016
2379
2017
26,443
2018
4226
2019
42
మొత్తం
36,643

పోస్టుల భర్తీ నిరంతర ప్రక్రియ

  • సీ విఠల్‌, టీఎస్‌పీఎస్సీ సభ్యుడు


ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ అని టీఎస్‌పీఎస్సీ సభ్యుడు సీ విఠల్‌ తెలిపారు. టీఎస్‌పీఎస్సీ నుంచి త్వరలో గ్రూప్‌1, గ్రూప్‌ 3 నోటిఫికేషన్లు వెలువడుతాయని చెప్పారు. విద్యార్థులు స్వయంఉపాధి, ప్రైవేటురంగాలపై కూడా దృష్టి సారించి అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా పోస్టు భర్తీ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ముందడుగు వేయలేని పరిస్థితి ఉన్నదని చెప్పారు. ప్రాముఖ్యరంగాల్లో ఉద్యోగాల భర్తీ వేగంగా జరిగిందని పేర్కొన్నారు. కాళేశ్వరం చేపట్టాక 4వేలు, మిషన్‌ భగీరథ పథకం కోసం 2 వేల ఇంజినీర్ల పోస్టులు భర్తీచేసినట్టు చెప్పారు. వ్యవసాయశాఖలో 2వేలు ఏఈవో, పశుసంవర్థకశాఖలో వెటర్నరీ డాక్టర్లు, విద్యాశాఖలో టీచర్లు, గూప్‌-2 ద్వారా అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్లు.. ఇలా వివిధశాఖల్లో అవసరమైన నియామకాలు ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. 

142 గ్రూప్‌- 1 పోస్టులకు ఆర్థికశాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చిందని.. 13 శాఖల సంబంధించి మార్చుకున్న సర్వీస్‌రూల్స్‌ డాటా అందజేయగానే టీఎస్‌పీఎస్సీ నుంచి నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కోర్టుల్లో కేసులతో ఆలస్యమవుతుండటంతో డీఎస్సీని రద్దుచేసి టీఆర్టీ ద్వారా టీచర్‌ పోస్టులను భర్తీచేస్తున్నట్టు వివరించారు.  ఎనిమిదివేల టీచర్‌ పోస్టులు భర్తీ అయ్యాయని అన్నారు. 1998, 2008.. ఇలా అనేక డీఎస్సీల కేసులు హైకోర్టు, సుప్రీం కోర్టు వద్ద ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి అని మూడు రకాలుగా ఉద్యోగాల కల్పన ఉంటుందని.. విద్యార్థులు సామర్థ్యాలను బట్టి వాటిని ఎంచుకోవాలని సూచించారు. ప్రణాళికతో ముందుకెళితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం చాలా సులువు అని చెప్పారు.


logo