గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 16:46:57

తెలంగాణ‌లో రైతు సానుకూల విధానాలు అనేకం : మ‌ంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి

తెలంగాణ‌లో రైతు సానుకూల విధానాలు అనేకం : మ‌ంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి

నారాయణ పేట : తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం రైతు సానుకూల విధానాలు అనేకం తీసుకువ‌స్తున్న‌ట్లు రాష్ర్ట వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ర్టంలో వ్య‌వ‌సాయంపై ప్ర‌భుత్వం రూ. 60 వేల కోట్లు ఖ‌ర్చుపెడుతుంద‌ని తెలిపారు. నూత‌న రెవెన్యూ చట్టానికి మద్దతుగా నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు భారీ ట్రాక్టర్ల‌ ర్యాలీ కార్య‌క్రమం జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రులు నిరంజన్ రెడ్డి,  శ్రీనివాస్ గౌడ్‌, జెడ్పి చైర్‌పర్సన్ వనజమ్మ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఏ గ్రామంలో చూసిన రైతులు సంతోషంగా ఉన్నార‌న్నారు. కరోనా వంటి కష్ట సమయంలో గ్రామాల్లో వ్యవసాయం పండగలాగా జరుగుతుందన్నారు. గ్రామాల్లో భూ సమస్యలతో ప్రజలు అనేక‌ ఇబ్బందులు పడేవారు. వీట‌న్నింటినీ దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘ క‌స‌ర‌త్తు అనంత‌రం సీఎం కేసీఆర్ భూ సమస్యల పరిష్కారం కోసం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన‌ట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయ‌ని వెల్ల‌డించారు.


మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు సానుకూల విధానాలు అనేకం ప్రభుత్వం తీసుకొచ్చింద‌న్నారు. సాగునీరు, 24 గంటల విద్యుత్ రైతులకు అందిస్తున్న‌ట్లు తెలిపారు. రైతు భూ సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన‌ట్లు చెప్పారు. భారతదేశంలో ఉన్న చట్టాలను అధ్యయనం చేసి మూడేండ్ల కసరత్తు అనంత‌రం ఈ చట్టం రూప కల్పన జరిగిన‌ట్లు వెల్ల‌డించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూమిని ధరణి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. చిన్న, సన్నకారు రైతుల భూమికి భద్రత లభిస్తుంది. రైతు గౌరవాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 60 వేల కోట్ల రూపాయలు వ్యవసాయం కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతున్న‌ట్లు తెలిపిన మంత్రి అదే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో ఇరవై వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం లేద‌న్నారు. 


కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు రైతు వ్యతిరేకం అన్నారు. టీఆర్ఎస్ తోపాటు పలు పార్టీలు పార్లమెంట్ లో తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిపారు. దేశ రాజధానిలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. కొత్త చట్టంతో రైతుల మీద పడి దోచుకునే వాళ్లకు లైసెన్స్ వస్తుంద‌ని, కార్పొరేట్ ల నియంత్రణలో మార్కెట్ ఉంటుంద‌న్నారు. ఈ చట్టం రైతు, ప్రజల, వ్యవసాయ వ్యతిరేకం అన్నారు. మ‌రోవైపు కేంద్ర విద్యుత్ బిల్లుతో మోటార్ లకు మీటర్లు బిగించాల్సి వ‌స్తుంద‌న్నారు.