శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Sep 27, 2020 , 16:01:27

వారం రోజుల్లో భూ సమస్యల పరిష్కారం..

వారం రోజుల్లో భూ సమస్యల పరిష్కారం..

సిద్దిపేట : రైతులు పాసు పుస్తకాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తెచ్చారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మండల కేంద్రమైన తొగుటలో రైతువేదిక నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం తొగుట తహసీల్దార్ కార్యాలయాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అలాగే మార్కెట్ యార్డులో లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇక నుంచి ప్రతి మండలానికో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పెట్టి వారం రోజుల్లో సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. తెలంగాణ మొత్తం డిజిటల్ సర్వే చేసి రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం. మోటర్లు, మీటర్లు కాలకుండా నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో పంటకు రెండుసార్లు మోటర్లు కాలిపోయేవి. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. 


దుబ్బాక నియోజకవర్గంలో 544 రైతులు చనిపోతే వారంలో 5 లక్షల రూపాయలు అందజేశామని వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి పల్లెకు ఇంటింటా మంచి నీరు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వచ్చే సంవత్సరంలోపు తొగుటలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని హామీనిచ్చారు. సిద్దిపేట ప్రజలను ఎలా చూసుకున్నానో తొగుట, దుబ్బాక ప్రజలను అదే విధంగా చూసుకుంటానని తెలిపారు. కరోనా ప్రభావంతో ఆదాయం తగ్గిన పేదల పెన్షన్లను ఆపలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

logo