శనివారం 11 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 02:31:02

కార్పొరేషన్లలో సౌకర్యాల కల్పన

కార్పొరేషన్లలో సౌకర్యాల కల్పన

  • ప్రాధాన్యక్రమంలో పనులు పూర్తి 
  • డబుల్‌ బెడ్‌రూం ఇండ్లపై దృష్టి
  • ఎట్టిపరిస్థితుల్లో పనులు ఆలస్యం కావొద్దు 
  • అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశం
  • ఈ నెల మూడోవారంలో వరంగల్‌, ఖమ్మం పర్యటన

 హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్లలో ప్రజల కనీస అవసరాలపై దృష్టి సారించాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తిచేయాలని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌ ఏసీ గార్డ్స్‌లోని పురపాలకశాఖ కాంప్లెక్స్‌లో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్ల అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. నగరాల్లోని మౌలిక వసతుల కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని జిల్లా మంత్రులకు సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల్లోనూ ప్రాధాన్యక్రమంలో ముఖ్యమైన వాటిని వెంటనే పూర్తిచేయాలని కమిషనర్లను ఆదేశించారు. 

ఇందుకోసం నిర్దిష్ట క్యాలెండర్‌ను రూపొందించాలని సూచించారు. పనులు వేగంగా పూర్తికావడానికి మున్సిపల్‌శాఖ నుంచి అవసరమైన అన్ని సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు. త్వరలోనే అన్ని కార్పొరేషన్ల కమిషనర్లకు ఒకరోజు శిక్షణ ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాలను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రాధాన్యాల గుర్తింపుపై శిక్షణ కార్యక్రమంలో నిపుణులు చర్చిస్తారన్నారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లుచేయాలని పురపాలకశాఖ ఉన్నతాధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా వరంగల్‌, ఖమ్మం నగరాల్లో జరుగుతున్న పలు కార్యక్రమాల గురించి స్థానిక మంత్రులు వివరించారు. 

రోడ్ల నిర్వహణ, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, గ్రీనరీ, జంక్షన్ల అభివృద్ధి, టాయిలెట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఈ రెండు నగరాల్లో ప్రస్తుతం తాగునీరు అందుతున్న తీరుపైన మంత్రులు సమీక్షించారు. ఈ రెండు కార్పొరేషన్ల పరిధిలోని విలీన గ్రామాల్లో నూతన మున్సిపాలిటీ చట్టం ప్రకారం నిధులు ఖర్చుచేయాలని మంత్రులు సూచించారు. ఈ నెల మూడో వారంలో వరంగల్‌, ఖమ్మం పట్టణాల్లో స్వయంగా పర్యటించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, పువ్వాడ అజయ్‌, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్యే ధర్మరెడ్డి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు, కార్పొరేషన్ల కమిషనర్లు పాల్గొన్నారు.


logo