గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 17, 2020 , 02:33:24

టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడు మాధవరం సుదర్శన్‌రావు మృతి

టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడు మాధవరం సుదర్శన్‌రావు మృతి

  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌
  • మంత్రులు కేటీఆర్‌, ఈటల,ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ సంతాపం

కూకట్‌పల్లి/హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడు, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, కూకట్‌పల్లి సీనియర్‌ నేత మాధవరం సుదర్శన్‌రావు గుండెపోటుతో మృతిచెందారు. అనారోగ్యానికి గురై కొంతకాలంగా గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు అత్యంత సన్నిహితంగా మెలిగిన ఈయన.. టీడీ పీ ప్రభుత్వ హయాంలో 1983 ఎన్టీఆర్‌ తొలి క్యాబినెట్‌లో కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన మాధవరం రాంచందర్‌రావు, సుశీల ఏకైక సంతానం. 1982లో నందమూరి హరికృష్ణతో కలిసి సుదర్శన్‌రావు టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. అదే ఏడాది టీఎన్‌టీయూసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1999లో సనత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి టికెట్‌ రాకపోవడంతో చంద్రబాబుతో విభేదించి పార్టీకి దూరంగా ఉన్నారు. 2001లో ఉద్యమనేత కేసీఆర్‌తో కలిసి టీఆర్‌ఎస్‌ ఏర్పాటుకు కృషిచేశారు. 2001 నుంచి కేసీఆర్‌ అడుగు జాడల్లో నడుస్తూ పార్టీ ఆవిర్భావసభ నుంచి 2009 అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన హమాలీల సంక్షేమానికి పాటుపడ్డారు. 30 ఏండ్ల పాటు హమాలీల అభ్యున్నతికి కృషిచేశారు.

టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడిగా పనిచేసి పార్టీ అభివృద్ధికి దోహదపడ్డారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీచేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌కుమార్‌కు ఈయన మేనమామ అవుతారు. సుదర్శన్‌రావు మృతిపట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఉద్యమం తొలినాళ్లలో అద్భుతంగా పనిచేసిన నాయకుడని గుర్తుచేసుకున్నారు. చిన్నవయసులోనే చనిపోవటం దురదృష్టకరమని అన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. సుదర్శన్‌రావు మృతికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సంతాపం తెలిపారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి సుదర్శన్‌రావు అని, ఆయనతో తనకు వ్యక్తిగతంగా రెండు దశాబ్దాల అనుబంధం ఉన్నదని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదర్శన్‌రావు మృతి పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, వైద్యారోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ సంతాపం తెలిపారు. నిబద్ధత కలిగిన ఉద్యమకారుడిని పార్టీ కోల్పోయిందని వినోద్‌ వ్యాఖ్యానించారు. సుదర్శన్‌రావు మృతి పట్ల కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లతోపాటు, నాయకులు సంతాపం ప్రకటించారు.logo