ఆదివారం 31 మే 2020
Telangana - May 18, 2020 , 00:19:37

పోతిరెడ్డిపాడుపై పోరాడింది టీఆర్‌ఎస్సే

పోతిరెడ్డిపాడుపై పోరాడింది టీఆర్‌ఎస్సే

  • ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌/రామడుగు: శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణాజలాలను తరలించుకుపోతున్నారని ముందుగా గుర్తించి చెప్పింది, దానిద్వారా ఎన్ని టీఎంసీల నీళ్లు పోతాయని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చింది టీఆర్‌ఎస్‌ పార్టీయేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ స్పష్టంచేశారు. శనివారం కరీంనగర్‌ జిల్లాకేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడుపై ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌ తీరు చూస్తే తాతకు దగ్గులు నేర్పినట్లు ఉన్నదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ఉద్యమనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రిటైర్డ్‌ ఇంజినీర్లు, రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ విద్యాసాగర్‌రావుతో కలిసి దీనిపై లోతుగా చర్చించి, ఉద్యమం చేశారన్నారు. అటు పార్లమెంట్‌లోనూ లేవనెత్తామన్నారు.

 కేంద్రంలోని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ వద్ద ఫిర్యాదు చేసి ఆపే ప్రయత్నం చేశామని చెప్పారు. నాడు వైఎస్సార్‌ హయాంలోనే దానిని మొదలుపెట్టారనీ, ఇప్పుడు విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులంతా ఆ సమయంలో మంత్రులుగా ఉన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ నాయకులకు తమను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ఒక్కటే గ్రామాలను, రైతాంగాన్ని కాపాడుతున్నదన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ తీరు మార్చుకోవాలని హితవుపలికారు. అనంతరం  కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలోని తిర్మలాపూర్‌లో కట్ల శ్రీనివాస్‌ అనే వ్యక్తి సాగు చేస్తున్న అంజీరాతోటను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆశయానికి శ్రీనివాస్‌ ప్రాణం పోస్తున్నారని కొనియాడారు.


logo