మంగళవారం 19 జనవరి 2021
Telangana - Dec 26, 2020 , 01:08:51

‘పట్టభద్రుల’పై ద్విముఖ వ్యూహం

‘పట్టభద్రుల’పై ద్విముఖ వ్యూహం

  • రెండు ఎమ్మెల్సీల కైవసానికి టీఆర్‌ఎస్‌ కసరత్తు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరిగే రెండు పట్టభద్రుల శాసనమండలి స్థానాలనూ కైవసం చేసుకొనేందుకు టీఆర్‌ఎస్‌ సమాయత్తమవుతున్నది. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయిదాకా ఓటరు నమోదును దాదాపు పూర్తిచేయించిన పార్టీ శ్రేణులు.. నోటిఫికేషన్‌ వచ్చేలోగా గత ఆరేండ్లలో సీఎం కేసీఆర్‌ సారథ్యంలో సాధించిన ప్రగతిని పట్టభద్రులకు వివరించేందుకు సిద్ధమవుతున్నారు. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ స్థానానికి ఈ నెల 31తో ఓటరు నమోదుకు తుది గడువు ఉన్న ది. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ నియోజకవర్గానికి వచ్చేనెల 8 వరకు అవకాశం ఉన్నది. 

ఎన్నికలు జరిగే రెండు పట్టభద్ర నియోజకవర్గాలకు (ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో) సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మండలస్థాయిలో ఓటరు  నమోదుపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పట్టభద్రులను ఓటరుగా నమోదు చేయించే కార్యక్రమాన్ని ఈసారి టీఆర్‌ఎస్‌ పెద్దఎత్తున చేపట్టింది. ఉమ్మడి ఆరు జిల్లాల పరిధిలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జిలుగా ఏర్పడి ఓటర్ల నమోదు ప్రక్రియలో పాల్గొన్నారు. ఇప్పటికే ఒకట్రెండు దశల్లో నియోజకవర్గాలస్థాయిలో పట్టభద్రులతో సమావేశాలు నిర్వహించారు. 

ఓటరు నమోదు ప్రక్రియ పూర్తికాగానే పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి ప్రచార పర్వాన్ని చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది మార్చి 29తో రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్న విషయం తెలిసిందే.  ఈ రెండు స్థానాల భర్తీకి జనవరి చివరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్నది.

పట్టుదలతో పట్టభద్రుల దగ్గరికీ..

రెండు పట్టభద్ర స్థానాల్లో గెలుపుకోసం ఎన్నికలు జరిగే ఆరు జిల్లాల పరిధిలోని గులాబీ శ్రేణులు పట్టుదలతో పనిచేయాలని ఇప్పటికే పార్టీ సంబంధిత జిల్లాల నాయకులకు సంకేతాలు పంపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో ప్రభుత్వం గత ఆరున్నరేండ్లుగా సాధించిన ప్రగతిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం, వివిధ రంగాల్లో దేశానికే మార్గదర్శనం చేసేస్థాయికి  తెలంగాణ ఎదగడం వంటి అంశాలను అర్థం అయ్యేలా వివరించాలని సూచించింది. త్వరలో వేలాది ఉద్యోగాల భర్తీకి తీసుకుంటున్న చర్యలను కూడా పట్టభద్రుల దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.