ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 02:35:22

రికార్డు మెజార్టీ తథ్యం!

రికార్డు మెజార్టీ తథ్యం!

  • స్థానిక ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం
  • కవితకే 90 శాతం మంది ప్రజాప్రతినిధుల మద్దతు
  • ఎంపీ, ఎమ్మెల్సీ, పార్టీ నేతలతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అభ్యర్థి కవిత వరుస భేటీలు

హైదరాబాద్‌, నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రజాప్రతినిధులతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత వరుసభేటీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులతో సమావేశమై ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై లోతుగా చర్చించారు. మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఎంపీలు సురేశ్‌రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వీజీ గౌడ్‌, రాజేశ్వర్‌రావు, నిజామాబాద్‌ జెడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముజీబుద్దీన్‌, జెడ్పీ మాజీ చైర్మన్‌ దఫేదార్‌రాజు, పార్టీ జిల్లా ఇన్‌చార్జి తుల ఉమతో జరిగిన భేటీలోనూ ఉపపోరులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనలు అందించారు. పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహాలపై సవివరంగా చర్చించారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్‌, రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో మాజీఎంపీ కవిత గెలుపు తథ్యమైనప్పటికీ రికార్డుస్థాయి మెజార్టీ సాధించాలని ఆకాంక్షించారు. ఇతరపార్టీలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధుల చేరికలతో టీఆర్‌ఎస్‌ బలం మరింతగా పెరిగిందని నేతలు అభిప్రాయపడ్డారు.

వరుస భేటీలు

ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో భాగంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో వరుసభేటీలు కొనసాగుతున్నాయి. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి కవిత నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమవుఅవుతున్నారు. ఎన్నికల కార్యాచరణ, బాధ్యతల నిర్వహణపై చర్చిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మొత్తం 824 మంది ఓటర్లలో టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు 505 మంది ఉన్నారు. కాంగ్రెస్‌-140, బీజేపీ-84, ఐంఐఎం-28 మంది, స్వతంత్రులు 66 మంది ఉన్నారు. స్వతంత్ర సభ్యులతోపాటు కాంగ్రెస్‌, బీజేపీల నుంచి పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో 80 శాతం మంది మద్దతు టీఆర్‌ఎస్‌కే ఉన్నది. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక మరికొంతమంది టీఆర్‌ఎస్‌లో చేరారు. పోలింగ్‌ తేదీ నాటికి 90శాతం మంది స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితకు మద్దతిచ్చే అవకాశాలున్నాయని సమావేశంలో నేతలు చర్చించారు. పోలింగ్‌ పూర్తయ్యేదాకా నియోజకవర్గాలవారీగా బాధ్యతలు అప్పగించిన వారంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి వేముల సూచించారు. అక్టోబర్‌ 9న జరిగే ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కవిత భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించడం ఖాయమని ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులు సమావేశంలో అభిప్రాయపడ్డారు.


logo