మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Aug 12, 2020 , 01:36:52

రష్యా వ్యాక్సిన్‌పై తొందరొద్దు

రష్యా వ్యాక్సిన్‌పై తొందరొద్దు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రష్యా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌పై తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దని అమెరికాలో అంటువ్యాధుల వైద్య నిపుణుడిగా పని చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌ ప్రొఫెసర్‌ విజయ్‌ ఎల్దండి అన్నారు. వ్యాక్సిన్‌ పనితీరు, సామర్థ్యం, ప్రతికూల ప్రభావాలపై లోతైన పరిశోధన చేయాల్సి ఉన్నదని చెప్పారు. గతంలో డెంగ్యూ వ్యాక్సిన్‌ విషయంలో జరిగిన పరిణామాలను గుర్తుచేసుకోవాలని సూచించారు. ‘2016లో ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. డెంగ్యూ రాని వాళ్లకు సెనోఫి వ్యాక్సిన్‌ను ఇవ్వడం వల్ల కొంతమందికి ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువైంది. పరిస్థితి తీవ్రమై చనిపోయారు’ అని విజయ్‌ తెలిపారు. రష్యా వ్యాక్సిన్‌ ప్రకటన నేపథ్యంలో విజయ్‌ మంగళవారం ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రష్యా టీకా నిజంగానే విజయవంతమైనా.. పెద్దమొత్తంలో ఉత్పత్తి జరిగి అందరికీ చేరువయ్యేందుకు రెండు, మూడేండ్లు పడుతుందని తెలిపారు. అప్పటివరకు దానికోసమే ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా శానిటైజర్‌ (చేతులను తరచూ శుభ్రపర్చుకోవటం), మాస్క్‌ ధరించటం, భౌతికదూరం పాటించడం వల్ల సులువుగా వైరస్‌ను జయించవచ్చని సూచించారు.


logo