e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home Top Slides ట్రైటాన్‌ పెట్టుబడి 2100 కోట్లు

ట్రైటాన్‌ పెట్టుబడి 2100 కోట్లు

ట్రైటాన్‌ పెట్టుబడి 2100 కోట్లు
  • ముందుకొచ్చిన అమెరికా ఈవీ దిగ్గజ సంస్థ
  • ఐదేండ్లలో 50 వేల విద్యుత్తు వాహనాల ఉత్పత్తి
  • నిమ్జ్‌లో విడిభాగాల యూనిట్‌ ఏర్పాటుకు రెడీ
  • సుమారు 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
  • రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం
  • అనేక రాష్ర్టాలను కాదని తెలంగాణవైపు మొగ్గు
  • కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కే తారకరామారావు
  • పరిశ్రమకు అన్నివిధాలా సహకరిస్తామని హామీ

పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిచిన తెలంగాణకు మరో దిగ్గజ సంస్థ ఓటేసింది. కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ర్టాల్లో విద్యుత్‌ వాహనాల ప్లాంటు ఏర్పాటుకు ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులతో చర్చించినప్పటికీ చివరికి తెలంగాణను ఎంపిక చేసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రోడ్‌ ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజుల్లో మినహాయింపు, టీఎస్‌ఐపాస్‌ విధానాలు నచ్చి, ఇక్కడే పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నది. జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో రూ.2,100 కోట్ల పెట్టుబడితో వాహన విడిభాగాలు ఉత్పత్తి చేసే ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వంతో గురువారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది.

హైదరాబాద్‌, జూన్‌ 24 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. అమెరికాకు చెందిన లగ్జరీ కార్లు, ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ట్రైటాన్‌ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. విద్యుత్తు వాహనాల రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తున్న ట్రైటాన్‌-ఈవీ (ఎలక్ట్రిక్‌ వెహికిల్‌) ప్రైవేట్‌ లిమిటెడ్‌ రాష్ట్రంలో రూ.2,100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో గురువారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. పెట్టుబడి ప్రణాళికను పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుకు వివరించింది. భవిష్యత్తులో భారీగా డిమాండ్‌ ఉండే ఈవీ రంగంలో పెద్ద ఎత్తున విస్తరించేందుకు తమ కంపెనీ ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నట్టు మంత్రి కేటీఆర్‌కు కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి హిమాన్షు బీ పటేల్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. తమ కంపెనీ భారత్‌లో తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నదని, ఈ మేరకు వివిధ రాష్ర్టాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించాక తెలంగాణ కేంద్రంగా ముందుకెళ్లాలని నిర్ణయించిందని చెప్పారు. తెలంగాణకున్న అనుకూలతలను దృష్టిలో ఉంచుకొని రూ.2100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. జహీరాబాద్‌ నిమ్జ్‌లో తయారీ యూనిట్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ట్రైటాన్‌ భారత మార్కెట్‌లో ఈ ఏడాది మార్చిలో హెచ్‌ లగ్జరీ ఎస్‌యూవీ కారును లాంచ్‌ చేసింది. అక్టోబర్‌లోగా ఎన్‌4 మోడల్‌ను లాంచ్‌ చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించింది. ప్రస్తుతం పుణె కేంద్రంగా తాత్కాలికంగా హెచ్‌ లగ్జరీ వాహనాలను తయారుచేస్తుండగా, త్వరలో రాష్ట్రంలో శాశ్వత ప్లాంటు ఏర్పాటు చేయనున్నది.

ఈవీ పాలసీ దేశంలోనే అత్యుత్తమం

- Advertisement -

రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ట్రైటాన్‌ సంస్థకు మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ద్వారా భారీగా ఎలక్ట్రిక్‌ వాహనాలను రాష్ట్రంలో ఉత్పత్తి చేసే అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కంపెనీ ప్రణాళిక ప్రకారం తొలి ఐదేండ్లలో 50 వేలకుపైగా సెడాన్లు, లగ్జరీ కార్లు, ఇతర ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉత్పత్తి చేసే అవకాశముందన్నారు. కంపెనీ పెట్టుబడితో దాదాపు 25 వేలమందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముందని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఈవీ పాలసీ దేశంలోనే అత్యుత్తమమని చెప్పారు. టీఎస్‌ ఐ-పాస్‌లో మెగా ప్రాజెక్టుకు లభించే అన్నిరకాల సహాయ సహకారాలను ప్రభుత్వం తరపున అందిస్తామన్నారు. తెలంగాణ క్రమంగా ఈవీ రంగ పెట్టుబడులకు ఆకర్షణీయ ప్రాంతంగా మారుతున్నదని సంతోషం వ్యక్తంచేశారు. ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ అండ్‌ ఎనర్జీ స్టోరేజ్‌ పాలసీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్‌ ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజుల్లో మినహాయింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. పెట్రోల్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈవీ అనుకూల విధానాలను చేపట్టి ప్రోత్సహిస్తున్నది.

ఈవీల్లో ట్రైటాన్‌కు ప్రత్యేకస్థానం

అమెరికాతోపాటు ఇండియన్‌ మార్కెట్‌లో తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలనే లక్ష్యంతో ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్టు సీఈవో హిమాన్షు చెప్పారు. స్లీక్‌ అండ్‌ స్పోర్ట్‌ డిజైన్‌ వెహికిల్స్‌ తయారుచేయడం తమ ప్రత్యేకతని తెలిపారు. 2012లో సోలార్‌ బ్యాటరీ తయారీ కంపెనీని ప్రారంభించిన ట్రైటాన్‌ అనంతరం ఈవీల తయారీ చేపట్టి మార్కెట్‌లో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నది. లగ్జరీ వాహనాలే కాకుండా మిలిటరీ వాహనాలు, మాస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ వాహనాలు, చౌకధరలో చిన్నతరహా రవాణా వాహనాలను కూడా ఉత్పత్తి చేయనున్నట్టు హిమాన్షు తెలిపారు. ఇండియన్‌ మార్కెట్‌లో అతిపెద్ద సంస్థగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. తమ కార్ల కొనుగోలుదారుల సౌకర్యార్థం వాహనాల డీలర్‌షిప్‌ ఉన్న ప్రాంతాల్లో శాటిలైట్‌ చార్జింగ్‌ స్టేషన్లను కూడా ఏర్పాటుచేస్తామన్నారు. ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టం కోసం ఇప్పటికే భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. ఈవీల తయారీప్లాంటు ఏర్పాటు ద్వారా పలు అనుబంధ కంపెనీల ఏర్పాటుకు కూడా వీలు కలుగుతుందని వివరించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ట్రైటాన్‌ పెట్టుబడి 2100 కోట్లు
ట్రైటాన్‌ పెట్టుబడి 2100 కోట్లు
ట్రైటాన్‌ పెట్టుబడి 2100 కోట్లు

ట్రెండింగ్‌

Advertisement