శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 21:21:13

మావోయిస్టులకు సహకరిస్తున్న ఆదివాసీ నాయకులను గుర్తించాం: ఆదిలాబాద్‌ ఎస్పీ విష్ణు వారియర్‌

మావోయిస్టులకు సహకరిస్తున్న ఆదివాసీ నాయకులను గుర్తించాం: ఆదిలాబాద్‌ ఎస్పీ విష్ణు వారియర్‌

ఆదిలాబాద్‌: తమ స్వార్థం కోసం అమాయకులను తప్పుదోవ పట్టిస్తున్న కొందరు ఆదివాసీ నాయకులను గుర్తించామని ఆదిలాబాద్‌ ఎస్పీ, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్ జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ విష్ణు వారియర్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివాసీలను సమిధలుగా వాడుకొని మావోయిస్టులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిష్టవేసేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. జూలై 13న గుండాల గ్రామంలో మావోయిస్టు దళ సభ్యులను పట్టుకొనే దిశగా గాలింపు జరుపుతుండగా మావోయిస్టు రాష్ట్ర  కమిటీ సభ్యుడు మైలరపు అడేల్లు అలియాస్‌ భాస్కర్, అతడి దళం పోలీసుల ఉనికిని గుర్తించి వస్తువులన్నీ అక్కడే వదిలి పారిపోయినట్లు తెలిపారు. భాస్కర్‌ డైరీలో సమాచారం ఆధారంగా మావోయిస్టులకు సహకరిస్తున్న ఆదివాసీ నాయకులను గుర్తించామని వెల్లడించారు.  

మత్తాడిగూడ గ్రామానికి చెందిన సిడామ్‌ జంగదేవ్, సులుగుపల్లికి చెందిన సోయం చిన్నయ్య, రొంపల్లికి చెందిన చంద్రశేఖర్, చాల్ బడి గోవిందరావు, పార్వతిగూడ హనుమంతరావు, చోర్ పల్లి జగ్గారావు, తుడుందెబ్బకు చెందిన మహేశ్, డీటీఎఫ్‌కు చెందిన రమేశ్, ఆదివాసీ విద్యార్థి సంఘానికి చెందిన వివేక్, దీపక్ ఇంకా కొంతమంది మావోయిస్టు నాయకులతో సంబంధాలు పెట్టుకున్నట్లు కనుగొన్నామన్నారు. భాస్కర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు మావోయిస్టు కార్యక్రమాలు రహస్యంగా అమలు చేస్తున్నారని, అమాయక ఆదివాసీ యువతీ, యువకులను మభ్యపెట్టి మావోయిస్టు పార్టీలో చేరాలని ఉసికొల్పుతున్నారని చెప్పారు. ఆదివాసీ యువతీ యువకులు మావోయిస్టుల మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒకసారి మావోయిస్టుల ప్రేరణతో వారి అసాంఘిక కార్యకలాపాలలో పాలు పంచుకుంటే కేసుల పాలవుతారని, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు దూరమవుతారని హెచ్చరించారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ప్రజా శాంతికి, అభివృద్ధికి ఆటంకం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి సమాచారమున్నా పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా చేద్దామని పిలుపునిచ్చారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo