సోమవారం 01 జూన్ 2020
Telangana - May 06, 2020 , 01:20:58

ఇక ప్రతిరోజూ నీళ్లు

ఇక ప్రతిరోజూ నీళ్లు

  • కరీంనగర్‌లో ట్రయల్ రన్ ‌ మొదలు
  • త్వరలో మంత్రి కే తారకరామారావు చేతులమీదుగా ప్రారంభోత్సవం

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి/ కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ దాహార్తి తీరుతున్నది. ఇకనుంచి నిత్యం ఇంటింటికీ మంచినీటి సరఫరా జరుగనున్నది. వారం, పదిరోజుల్లో ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. మంగళవారం ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ ను  రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌.. మేయర్‌ సునీల్‌రావు కలిసి ప్రారంభించారు. ఈ పథకానికి సీఎంకేసీఆర్‌ 2017లో రూ.110 కోట్లు మంజూరుచేశారు. ఈ నిధులతో కొత్తగా 36 ఎమ్మెల్డీ (మెగా లీటర్‌ పర్‌ డే) సామర్థ్యం గల ఫిల్డర్‌బెడ్‌ను నిర్మించారు. దీంతో మొత్తం ఫిల్టర్‌బెడ్ల సామర్థ్యం 84 ఎమ్మెల్డీలకు చేరింది. కరీంనగర్‌ శాతవాహన యూనివర్సిటీ గుట్టపై 30 లక్షల లీటర్ల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను నిర్మించారు. ఫిల్టర్‌బెడ్‌ నుంచి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వరకు 7.7 కిలోమీటర్ల ప్రధాన పైపులైను, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి నగరంలో వివిధ రిజర్వాయర్ల నుంచి గ్రావిటీ ద్వారా నీరు తరలించేందుకు వీలుగా 19 కిలోమీటర్ల పైపులైన్లు, రిజర్వాయర్‌ నుంచి 110 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్‌ పైపులు వేశారు. వీటితోపాటు రాంనగర్‌, హౌసింగ్‌బోర్డుల్లో రిజర్వాయర్లు నిర్మించారు. 

ఇది సీఎం కేసీఆర్‌ వరం: మంత్రి గంగుల కమలాకర్‌

రాష్ట్రంలోనే మొదటిసారిగా కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రతిరోజూ మంచినీటి సరఫరాకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్టు  మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. ఇది కరీంనగర్‌ ప్రజలకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన వరమని చెప్పారు. ట్రయల్ రన్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పక్కనే మానేరుడ్యాం ఉన్నా నగర ప్రజలు ఇన్నాళ్లూ తాగునీటి కోసం ఇబ్బందిపడ్డారని విమర్శించారు. ట్రయల్న్‌ల్రో ఎక్కడైనా  సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి, మంచి ముహూర్తం చూసుకొని మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామన్నారు. ఇది విజయవంతమైన తర్వాత నగరంలో 24 గంటల నీటి సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శశాంక, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌, నగర కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

మంత్రి గంగులకు అభినందనలు

కరీంనగర్‌లో అర్బన్‌ మిషన్‌ భగీరథ ట్రయల్‌ రన్‌ ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. కరీంనగర్‌ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని, నగరవాసులకు ప్రతిరోజూ తాగునీరు అందించేందుకు ఏర్పాట్లుపూర్తిచేశామని మంత్రి గంగుల కమలాకర్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. దీనిని కేటీఆర్‌ రీట్వీట్‌చేశారు. 


logo