శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 01:58:50

హైవేలపై ట్రామా సెంటర్లు

హైవేలపై  ట్రామా సెంటర్లు

  • ఔటర్‌ వెంట అంబులెన్స్‌ సర్వీసులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని అన్ని స్టేట్‌ హైవేల వెంట లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్స్‌ సర్వీసెస్‌, ట్రామా సెంటర్లను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. శనివారం ఔటర్‌ రింగురోడ్డు శంషాబాద్‌ ఇంటర్‌చేంజ్‌ వద్ద హెచ్‌ఎండీఏ ఏర్పాటుచేసిన లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్స్‌ సర్వీసెస్‌, ట్రామా కేంద్రాలను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.  ఔటర్‌ రింగురోడ్డు వెంట ఆధునాతన అంబులెన్స్‌ సేవలను అందించేందుకు కృషిచేసిన హెచ్‌ఎండీఏ యంత్రాంగాన్ని ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రశంసించారు.

ఈ సందర్భంగా అపోలో దవాఖాన రీజినల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి వై సుబ్రమణ్యం మాట్లాడుతూ.. క్షత్రగాత్రుల ప్రమాద పరిస్థితిని బట్టి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీనియర్‌ డాక్టర్లు, నిపుణుల సమక్షంలో వారి సూచనలు సలహాల ప్రకారం ట్రామా సెంటర్లలో వైద్య సేవలు అందిస్తామని మంత్రికి వివరించారు. ఔటర్‌పై ప్రసుత్తం 10 ఇంటర్‌చేంజ్‌ల వద్ద ఇలాంటి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ చెప్పారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌, హెచ్‌ఎండీఏ హెచ్‌జీసీఎల్‌ (ఔటర్‌) విభాగం ఎండీ సంతోష్‌, హెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి, సీఏవో శరత్‌చంద్ర, సీజీఎం రవీందర్‌, మాజీద్‌ షరీఫ్‌ పాల్గొన్నారు.