గురువారం 09 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 18:08:21

ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభం

ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభం

హైదరాబాద్‌ : ఆర్టీసీ పార్సిల్‌, కొరియర్‌, కార్గో సర్వీసులను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నేడు ప్రారంభించారు. నగరంలోని ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో మంత్రి ఈ సేవలను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ఆర్టీసీపై ప్రజలకున్న నమ్మకమే నూతనంగా తీసుకువచ్చిన ఈ సర్వీసులను విజయవంతం చేస్తుందని అన్నారు. అన్ని బస్‌స్టేషన్లలో కార్గో సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇందుకు సంబంధించి మొబైల్‌ యాప్‌ను కూడా త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు.

సంస్థలో ప్రస్తుతం అన్ని ప్రైవేట్‌ సేవలు రద్దు చేసినట్లు తెలిపారు. కరోనా కారణంగా సిటీలో లోకల్‌ బస్సులు, అంతరాష్ట్ర బస్సులు నడపడం లేదన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రతపై త్వరలోనే జీవో ఇస్తామన్నారు. ప్రతి రోజు ఆర్టీసీకి రూ.12 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. కానీ రూ. 4 కోట్లు మాత్రమే వస్తోందన్నారు. ఆర్టీసీ కష్ట కాలంలో ఉందన్నారు. అవసరం మేరకే బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు 50 శాతం జీతం ఇస్తున్నామన్నారు. కరోనా లక్షణాలు ఉన్న సిబ్బందికి ఆర్టీసీ సొంత ఖర్చులతో పరీక్షలు చేయిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.logo