సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 02:40:55

ఊసరవెల్లి కరోనా

ఊసరవెల్లి కరోనా

  • రూపాంతరం చెందుతున్న వైరస్‌
  • భారతదేశంలో 2,441 రూపాలు
  • 1,500 జీనోమ్‌ల విశ్లేషణ
  • రాష్ట్రంలో ఎక్కువగా ‘ఏ2ఏ’ రకం వ్యాప్తి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. ఊసరవెల్లిని మించి రూపాంతరం చెందుతున్నది. కొవిడ్‌-19 ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సమయంలో జన్యుక్రమంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు గతంలోనే ప్రకటించారు. అయితే ఇది అనూహ్యస్థాయిలో ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో వైరస్‌ జన్యుక్రమాలను (జీనోమ్‌) విశ్లేషించిన కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో 2,441 రూపాంతరాలు గుర్తించినట్టు సీసీఎంబీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 1,468 నమూనాల నుంచి సేకరించిన జన్యుక్రమాలను విశ్లేషించినట్టు వివరించాయి.

మన దేశంలో ఏ2ఏ రకమే ఎక్కువ

కొవిడ్‌-19 నిర్మాణంలోని స్వల్ప మార్పుల ఆధారంగా వైరస్‌ను శాస్త్రవేత్తలు కొన్ని సమూహాలుగా విభజించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పదికిపైగా కరోనా వైరస్‌ సమూహాలు వ్యాప్తిచెందుతున్నాయి. భారత్‌లో నాలుగైదు రకాల వైరస్‌ సమూహాలున్నట్టు సీసీఎంబీ వర్గాలు పేర్కొన్నాయి. దేశంతోపాటు తెలంగాణలో ‘ఏ2ఏ’ రకం వైరస్‌ ఎక్కువగా కనిపిస్తున్నది. శాస్త్రవేత్తలు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,468 జీనోమ్‌లను విశ్లేషించగా.. ఇందులో 879 (60 శాతం) ఏ2ఏ రకానివిగా గుర్తించారు. ఆ తర్వాత ఏ3ఐ రకం (402 జీనోమ్‌లు) వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారించారు. 

మొదట్లో ఏ3ఐ, ఇప్పుడు ఏ2ఏ

తెలంగాణకు సంబంధించి సీసీఎంబీ శాస్త్రవేత్తలు 193 నమూనాల జీనోమ్‌లను విశ్లేషించారు. ఇందులో 109 జన్యుక్రమాలు ఏ2ఏ రకం సమూహానివిగా, 77 నమూనాలు ఏ3ఐ రకానివిగా తేలింది. మిగిలినవి ఇతర రకాల వైరస్‌లు. అంటే రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా ఏ2ఏ రకానికి చెందినవే. మొదట్లో రాష్ట్రంలో ‘ఏ3ఐ’ రకానికి చెందిన వైరస్‌ మాత్రమే కనిపించింది. ఏప్రిల్‌ మూడోవారం వరకూ ఇదే ట్రెండ్‌ కొనసాగింది. మే మొదటివారం నుంచి ఇప్పటివరకు ‘ఏ2ఏ’ రకం వైరస్‌ మాత్రమే కనిపిస్తున్నది.

సీసీఎంబీ ‘గేర్‌-19’

కరోనా జన్యుక్రమాలపై జరుగుతున్న పరిశోధనలను ఏకతాటిపైకి తెచ్చేందుకు సీసీఎంబీ ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించింది. ‘జీనోమ్‌ ఎవల్యూషన్‌ ఎనాలసిస్‌ రిసోర్స్‌ ఫర్‌ కొవిడ్‌-19’ (గేర్‌-19) పేరుతో గత నెలలో ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా 19కి పైగా రాష్ర్టాల్లో, 35 ల్యాబ్‌లలో జరుగుతున్న పరిశోధనల వివరాలను క్రోడీకరించి ఇందులో పొందుపరుస్తున్నది.logo