బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 03:20:43

యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ పునరుద్ధరణ

యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ పునరుద్ధరణ

  • నిలిచిపోయిన చోట సత్వరమే మరమ్మతు పనులు
  • రంగంలోకి ఎమర్జెన్సీ బృందాలు
  • డిస్కంల పరిధిలో కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు
  • పరిస్థితిని సమీక్షిస్తున్న ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో విద్యుత్‌శాఖకు అపార నష్టం వాటిల్లినప్పటికీ వినియోగదారులకు అసౌకర్యం కలుగకుండా వెంట వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టి నిరంతరాయ సరఫరాకు చర్యలు తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, కొన్నిచోట్ల ముందుజాగ్రత్త చర్యగా సరఫరాను నిలిపివేశారు. అయితే కొద్దిగంటల్లోనే నగరంలోని అత్యధిక ప్రాంతాలకు సరఫరాను పునరుద్ధరించారు. భారీ వర్షం, ఈదురుగాలుల ధాటికి రాష్ట్రమంతటా చెట్లు కూలి విద్యుత్‌ తీగలు తెగిపోయాయి. వందల సంఖ్యలో స్తంభాలు వంగిపోయాయి. అనేక సబ్‌స్టేషన్లు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పడిపోయింది. బుధవారం రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 4184 మెగావాట్లుగా నమోదైంది. దీంతో విద్యుత్‌ ఉత్పత్తికి, డిమాండ్‌కు మధ్యనున్న తేడాను సమన్వయం చేసుకుంటూ గ్రిడ్‌కు ఎలాంటినష్టం వాటిల్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఓ వైపు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటూనే మరోవైపు పునరుద్ధరుణ పనులు చేపట్టారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు నేతృత్వంలో విద్యుత్‌ సంస్థల అధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది, కార్మికులు ఎమర్జెన్సీ విధులు నిర్వర్తిస్తున్నారు.  మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఒక్కో సెక్షన్‌ పరిధిలో 20-25 మంది నిష్ణాతులైన కార్మికులతో ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటుచేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సుమారు 189 బృందాలు పనిచేస్తున్నాయి. 

కొట్టుకుపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు

జీహెచ్‌ఎంసీ పరిధిలో 65 ట్రాన్స్‌ఫార్మర్లు నీటిలో మునిగిపోయినట్టు, 318 స్థంభాలు విరిగిపోయినట్టుగా తెలుస్తున్నది. మూసినదీకి వరదలు రావడంతో నల్లగొండ జిల్లా పరిధిలో సుమారు 200 ట్రాన్స్‌ఫార్మర్లు కొట్టుకుపోయినట్టు విద్యుత్‌ శాఖ అంచనా వేసింది. వందల సంఖ్యలో స్తంభాలు వంగిపోగా, అదేస్థాయిలో వైర్లు తెగిపడినట్టు తెలుస్తున్నది. ఇంకా అనేక ప్రాంతాల్లో వరద నీరు నిలిచి ఉండటంతో నష్టం ఎంతనేది అంచనా వేయడం కష్టంగా ఉంది. సూర్యాపేటలోని 400 కేవీ సబ్‌ స్టేషన్‌, ఇమ్లీబన్‌లోని 132 కేవీ సబ్‌స్టేషన్‌, కూకట్‌పల్లిలోని సబ్‌స్టేషన్‌, ఇంకా పలు సబ్‌స్టేషన్లు వరద నీటిలో మునిగిపోయాయి. దీనిపై ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు విద్యుత్‌ సంస్థల అధికారులతో సమీక్ష జరిపారు. ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ గోపాలరావు, డైరెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విద్యుత్‌ సంబంధ ఫిర్యాదుల కోసం రెండు డిస్కంల పరిధిలో ప్రత్యేక కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేశారు. ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో 9440811244/45, 1912, 18004250028 నంబర్లకు, అలాగే ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 7382072104/06, 7382 071574, 1912, 100 నెంబర్లకు ఫోను చేసి ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. logo