శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 25, 2020 , 02:00:54

అండగా ఉంటాం.. ఆదరిస్తాం

అండగా ఉంటాం.. ఆదరిస్తాం

  • ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు 
  • శ్రీశైలం మృతుల కుటుంబాలకు పరామర్శ
  • విద్యుత్‌ చరిత్రలో వారిపేర్లు శాశ్వతమని వ్యాఖ్య

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/హైదరాబాద్‌ సిటీబ్యూరో : శ్రీశైలం జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో ప్రాణాలు వదిలిన ఉద్యోగుల కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని, తమ కుటుంబసభ్యులుగానే ఆదరిస్తామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన విద్యుత్‌ ఉద్యోగుల కుటుంబాలను ఇతర అధికారులతో కలిసి సీఎండీ సోమవారం వారి ఇండ్లకు వెళ్లి పరామర్శించారు. జెన్‌కో తరఫున, వ్యక్తిగతంగా మృతులకు నివాళులర్పించారు. హైదరాబాద్‌ చంపాపేటలోని డీఈ శ్రీనివాసగౌడ్‌, అజంపురలోని ఉజ్మాఫాతిమా, జీడిమెట్లలోని మోహన్‌కుమార్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఏఈ సుందర్‌కుమార్‌ కుటుంబసభ్యులను నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు సీఈ సూర్యనారాయణ సూర్యాపేటకు వెళ్లి పరామర్శించి, సంతాప సందేశం అందించారు. మధిరలో ఉండే ఏఏఈ వెంకట్రావు, కారేపల్లిలో ఉండే ప్లాంట్‌ అటెండెంట్‌ వై రాంబాబు, పాల్వంచలో ఉండే జూనియర్‌ ప్లాంట్‌ అటెండెంట్‌ కిరణ్‌కుమార్‌ కుటుంబసభ్యులను కేటీపీఎస్‌ సీఈ రవీంద్రకుమార్‌ పరామర్శించారు. సీఎండీ బాధితుల ఇండ్లకు వెళ్లగానే కుటుంబసభ్యులంతా భోరున విలపించారు. 

ఇది చూసిన ప్రభాకర్‌రావు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. మరణించివారిని తీసుకురాలేమని, మానవ మాత్రులుగా చేయగలిగినంత చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీశైలం ప్రమాదం అత్యంత దురదృష్టకరమని, తనకు వ్యక్తిగతంగా ఎంతో క్షోభను మిగిల్చిన దుర్ఘటన అని పేర్కొన్నారు. వారి కుటుంబసభ్యులు ఎంతగా విలపిస్తున్నారో.. తానుకూడా అంతటి దుఃఖాన్ని అనుభవిస్తున్నానని తెలిపారు. సహచర ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించినవారి కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్‌ ఆర్థికసాయం అందించారని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగావకాశం కల్పిస్తామని, శాఖాపరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. తెలంగాణ విద్యుత్‌ చరిత్రలో అమరుల పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని చెప్పారు.

శ్రీశైలం మృతుల కుటుంబాలకు రూ.3 కోట్లు ఇవ్వాలి

శ్రీశై లం దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇంజినీర్లకు ఒక్కొక్కరికీ రూ.3కోట్ల చొప్పున వారి కుటుంబాలకు పరిహారం అందించాలని తెలంగాణ పవర్‌ ఎంప్లాయి స్‌ జేఏసీ డిమాండ్‌చేసింది. ఈ మేరకు జేఏసీ నేతలంతా సోమవారం విద్యుత్‌సౌధలో టీఎస్‌ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావును కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. చనిపోయిన వారంతా చిన్న వయస్సువారేనని, వారిపై ఆధారపడినవారంతా షాక్‌లో ఉన్నారని, పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని సీఎండీ దృష్టికి తీసుకొచ్చారు. సీఎండీని కలిసిన వారిలో జేఏసీ నేతలు పీ రత్నాకర్‌రావు, ఎస్‌ పద్మారెడ్డి, వజీర్‌, సదానందం, మేడి రమేశ్‌, వంశీ, నెహ్రు, భానుప్రకాశ్‌ తదితరులున్నారు.

మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసిన టీఈఈజేఏసీ

శ్రీశైలం ప్రమాదంలో ఒక్కో మృతుడి కుటుంబాని కి రూ.2 కోట్ల పరిహారం చెల్లించాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని కోరుతూ తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ వినతిపత్రం సమర్పించింది. టీఈఈ జేఏసీ నేతలు ఎన్‌ శివాజీ, పీ అంజయ్య మాట్లాడు తూ.. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం కేసీఆర్‌గారు హామీనివ్వడాన్ని స్వాగతిస్తున్నామని, పరిహారాన్ని రూ.2 కోట్లకు పెంచాలని కోరారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకుముందు  మృతులకు సంతాపసూచకంగా కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆగస్టు 21వ తేదీని విద్యుత్‌ అమరవీరుల దినంగా పాటించాలని డిమాండ్‌ చేశారు. 


logo