శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 01:24:48

గ్రామీణ యువతకు ఐటీఐల్లో శిక్షణ

గ్రామీణ యువతకు ఐటీఐల్లో శిక్షణ

మేడ్చల్‌ కలెక్టరేట్‌: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణప్రాంత యువత నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇంచార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి కోరారు. ప్రభుత్వ ఐటీఐల ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, వాటిని మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. 

మహిళా సాధికారతే లక్ష్యం

మహిళల స్వయం సమృద్ధి, సాధికారతే లక్ష్యంగా పేద మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై దృష్టి సారించిందని చెప్పారు. పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని టీఎస్‌ ఐపార్డ్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై నిర్వహించిన వర్క్‌షాప్‌కు ఎర్రబెల్లి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నిరుపేద మహిళలను సంఘటిత పరిచి స్వయం సహాయక సంఘాల ద్వారా పొదుపులో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిన సెర్ప్‌ కృషి వెలకట్టలేనిదని ప్రశంసించారు. కాగా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చే ఉమెన్‌ హబ్‌ (వీ-హబ్‌)తో నిరుపేద ఔత్సాహిక మహిళలకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల మీద శిక్షణనిచ్చేందుకు సెర్ప్‌ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నది. మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో సెర్ప్‌ సీఈవో సందీప్‌కుమార్‌ సుల్తానియా, వీహబ్‌ సీఈవో దీప్తిరెడ్డి పత్రాలను మార్చుకున్నారు.  


logo