మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 03, 2020 , 02:44:03

విషాదం మిగిల్చిన సెల్ఫీ

 విషాదం మిగిల్చిన సెల్ఫీ

  • చెరువులో మునిగి విద్యార్థి మృతి, మరొకరు గల్లంతు
  • మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలో ఘటన

శామీర్‌పేట: నీళ్ల సరదా, సెల్ఫీమోజు రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. శామీర్‌పేట పెద్దచెరువు అందాలను శుక్రవారం తిలకించేందుకు వచ్చి నీళ్లలో స్నానం చేస్తూ స్నేహితుల కండ్ల ముందే ఓ విద్యార్థి నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థి గల్లంతయ్యాడు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా సఫిల్‌గూడ పాత పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉండే సునీత మురళీ దంపతుల చిన్న కుమారుడు సిజ్జు అలియాస్‌ మనీశ్‌(16), అదే ప్రాంతానికి చెందిన శ్రీదేవి, శ్రీనివాస్‌ దంపతుల రెండో కుమారుడు పింటూ అలియాస్‌ ఉత్తేజ్‌(16), ఉత్తేజ్‌ సోదరి పింకి అలియాస్‌ ఉజ్వల, మేఘన, సుమిత్‌, శ్రీధర్‌ బైక్‌పై శామీర్‌పేట పెద్ద చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ కట్టమైసమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం సరదాగా మనీశ్‌, ఉత్తేజ్‌, సుమిత్‌ స్నానం చేసేందుకు చెరువులోకి దిగి, సెల్ఫీలు తీసుకున్నారు. ఈ క్రమంలో మనీశ్‌, ఉత్తేజ్‌ చెరువు లోపలికి వెళ్లడంతో స్నేహితుల కండ్ల ముందే మునిగి పోయారు. వారిద్దరూ సుమిత్‌ను పట్టుకునే ప్రయత్నంచేసినా..అది ఫలించలేదు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్ల సాయంతో గాలించారు. అపస్మారకస్థితిలో కనిపించిన మనీశ్‌ను మేడ్చల్‌లోని దవాఖానకు తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. గల్లంతైన ఉత్తేజ్‌ ఆచూకీ కోసం డీఆర్‌ఎఫ్‌ ఫోర్స్‌ రంగంలోకి దిగింది.


logo