సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 01, 2020 , 08:10:14

11 మంది ఛత్తీస్‌గడ్‌ బాలలకు విముక్తి

11 మంది ఛత్తీస్‌గడ్‌ బాలలకు విముక్తి

మన్సూరాబాద్‌ : నగరంలోని వివిధ కంపెనీల్లో పని చేసేందుకు గాను ఛత్తీస్‌గడ్‌ నుంచి తీసుకువస్తున్న 11 మంది బాలురకు ఎస్‌ఓటీ బృందం.. ఎల్బీనగర్‌ పోలీసుల సహకారంతో విముక్తి కల్పించారు. బాలుర అక్రమ రవాణా విషయంపై ఛత్తీస్‌గడ్‌లోని బచ్‌పన్‌ బచావో కమిటీ నగరంలోని సీడబ్ల్యూసీ, డీసీపీయూ, చైల్డ్‌ లైన్‌ కమిటీలకు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని సదరు కమిటీ సభ్యులు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌కు తెలియజేశారు. సీపీ  ఆదేశాలతో ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ జోన్‌ బృందం, ఎల్బీనగర్‌ పోలీసులు, సీడబ్ల్యూసీ, డీసీపీయూ, చైల్డ్‌లైన్‌ కమిటీ సభ్యులు  చింతలకుంట వద్ద ఛత్తీస్‌గడ్‌ నుంచి వస్తున్న జగదల్‌పూర్‌కు చెందిన అశ్విని రాజ్‌కుమార్‌ మైనింగ్‌ ట్రేడింగ్‌ కంపెనీకి చెందిన బస్సును తనిఖీ చేశారు. బస్సులో ఉన్న 25 మందితో పాటు వారిని పనులలో నియమించేందుకు తీసుకువస్తున్న జన్ను కోయెమ్‌, లలిత్‌బాగ్‌, నాదుగురామ్‌, కైలాస్‌లను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో బోర్‌వెల్‌, కన్‌స్ట్రక్షన్‌ ఫీల్డ్‌, కట్టెల మిషన్‌లపై పని చేసేందుకు తీసుకువస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బస్సులో ఉన్న 25 మందిలో 14 మంది మేజర్లు ఉన్నట్లు గుర్తించి వారిని వదిలివేశారు.  11 బాలలను   సైదాబాద్‌లోని బాలుర హోంకు తరలించారు. మైనర్‌ బాలురను అక్రమంగా నగరానికి తీసుకువస్తున్న జన్ను కోయెమ్‌, లలిత్‌బాగ్‌, నాదుగురామ్‌, కైలాస్‌లను పోలీసులు అరెస్టు చేశారు. డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ (డీసీపీయూ) ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  logo