న్యూ ఇయర్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్‌లో పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఇందులోభాగంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. నగరంలో రద్దీ ఏర్పడే ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించారు. హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లను మూసివేడంతోపాటు వాహనాలను మళ్లించను న్నారు. అదేవిధంగా సైబర్ టవర్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్లు, జేఎన్టీయూ, మైండ్ స్పేస్, దుర్గంచెరువు తీగల వంతెనను కూడా మూసివేయనున్నారు.
ఔటర్ రింగ్‌రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే కార్లు, జీపుల రాకపోకలపై నిషేధం విధించారు. విమానాశ్రయానికి వెళ్లే వాహనాలు, సరుకు రవాణా వాహనాలకు మాత్రమే అనుమతించనున్నారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు మార్గాల్లో ఇవాళ రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.