ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 08:57:05

కొనసాగుతున్న కార్మిక సంఘాలు సమ్మె

కొనసాగుతున్న కార్మిక సంఘాలు సమ్మె

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె విజయవంతంగా కొనసాగుతున్నది. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మెకు మద్దతుగా 46 వేల మంది సింగరేణి కార్మికులు విధులు బహిష్కరించారు. సమ్మెలో భాగంగా నల్లగొండ ఆర్టీసీ డిపోలో వామపక్ష నేతలు, కార్మికులు ఆందోళన చేపట్టారు. నల్లగొండ డిపో నుంచి బస్సులు వెళ్లకుండా అడ్డుకున్నారు. సూర్యాపేట డిపో ఎదుట వామపక్ష కార్యకర్తలు ధర్నాచేపట్టారు. దీంతో జిల్లాలో 130 బస్సులు డిపోలకే పరిమితమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి కార్మికులు విధులు బహిష్కరించారు. దీంతో కొత్తగూడెం సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్తత్పి నిలిచిపోయింది. కొత్తగూడెంలో 84 బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెకు టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది.


జాతీయ కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ఏరియా సింగరేణి బొగ్గు గనుల్లో విధులకు అత్యవసర సిబ్బంది మినహా కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. సమ్మె తో భూపాలపల్లి ఏరియా లోని  కేటీకే ఒకటి, ఐదు, ఆరు, ఎనిమిదో భూగర్భ గనులు, అదేవిధంగా కేటీకే, ఓసీపీ- 2 (ఉపరితల గని) సమ్మెతో బొగ్గు ఉత్పత్తి స్తంభించిపోయింది. కార్మికులు విధులను బహిష్కరించడంతో బొగ్గు గనులు అన్ని బోసిపోయాయి. 


ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకుల ప్రైవేటీకరణ, రక్షణరంగ సంస్థల కార్పొరేటీకరణ, కార్మిక విధానాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, బొగ్గు పరిశ్రమలో కమర్షియల్ మైనింగ్ నిలుపుదల, కోలిండియాలో పెట్టుదల ఉపసంహరణ నిలుపుదల బొగ్గు గనుల ప్రైవేటీకరణ తదితర డిమాండ్లతో కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మేకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు బీఎంఎస్ మినహా మిగతా జాతీయ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో దేశవ్యాప్తంగా సుమారు 25 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు.