మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 15:04:58

పట్టణాలు, గ్రామాలు పచ్చదనంతో ఉట్టిపడాలి

పట్టణాలు, గ్రామాలు పచ్చదనంతో ఉట్టిపడాలి

కరీంనగర్ : జిల్లాలో హరితహారంలో భాగంగా పట్టణాలు, గ్రామాలు పచ్చదనంతో ఉట్టిపడేలా మొక్కలు నాటాలని,  అలాగే రహదారులు పచ్చని చెట్లతో  కమ్ముకొనే విధంగా విరివిరిగా చెట్లు నాటాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా జిల్లా కలెక్టర్ కే.శశాంక, ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్ రావు, మేయర్ సునిల్ రావు, కమిషనర్ క్రాంతితో కలిసి మొక్కలు నాటారు.  స్థానిక ఆర్.టి.సి. వర్కుషాపు సమీపంలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  జిల్లాను ఆకుపచ్చ  కరీంనగర్ గా తయారు చేసేందుకు ఆరో విడత హరితహారంలో భాగంగా  జిల్లాలో 55 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో నగరంలో 14.5 కిలోమీటర్ల పరిధిలో 10 లక్షల మొక్కలు నాటుతామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. గతంలో అడవులకు నిలయంగా ఉన్న కరీంనగర్ జిల్లాకు చెట్ల పెంపకంతో పూర్వ వైభవం తీసుకొస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు.


logo