ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 02:27:30

పర్యాటకం పునఃప్రారంభం : మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌

పర్యాటకం పునఃప్రారంభం : మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌

  • నేటినుంచి తెరుచుకోనున్న పురావస్తు, క్రీడా ప్రాంగణాలు
  • కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ పర్యాటకులకు అనుమతి
  • ఎక్సైజ్‌, టూరిజం, క్రీడలశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా గురువారం నుంచి పర్యాటక, క్రీడాశాఖల పరిధిలోని బోటింగ్‌, టూరిజం బస్సు సర్వీసులు, మ్యూజియంలు, మైదానాలు, స్టేట్‌ గ్యాలరీలను పునఃప్రారంభిస్తున్నట్టు క్రీడలు, పర్యాటక, సాంస్కతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌ ఐదోవిడుత మార్గదర్శకాలను విడుదలచేసిన నేపథ్యంలో మంత్రి మీడియాకు వివరించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర టూరిజంశాఖ ఆధ్వర్యంలోని పర్యాటక కేంద్రాలలోని బోటింగ్‌, పర్యాటక బస్సు సర్వీసులతోపాటు పురావస్తుశాఖ ఆధ్వర్యంలోని పురాతన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు, కోటలు, మ్యూజియంలు, క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని మైదానాలు, క్రీడావసతులు ఉన్న కేంద్రాలు, స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీల వద్ద సందర్శకుల టెంపరేచర్‌ను తనిఖీచేసిన అనంతరం అనుమతించాలని సూచించారు. పర్యాటకశాఖ సిబ్బంది తప్పనిసరిగా ఫేస్‌ మాస్క్‌తోపాటు గ్లౌస్‌లు ధరించాలని పేర్కొన్నారు. సందర్శకులు, పర్యాటకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఆరడుగుల భౌతికదూరం పాటించేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. క్రీడాశాఖ, క్రీడా ప్రాధికార సంస్థ మైదానాలతోపాటు క్రీడావసతులు ఉన్న సెంటర్లలో విధిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని చెప్పారు. ప్రైవేట్‌ క్రీడాకేంద్రాల్లో కూడా విధిగా కొవిడ్‌ నిబంధనలు అమలుచేయాలని విజ్ఞప్తిచేశారు. పర్యాటకశాఖ సిబ్బంది తప్పనిసరిగా క్రమం తప్పకుండా హ్యాండ్‌ శానిటైజర్‌ను ఉపయోగించాలని తెలిపారు. సందర్శకుల కోసం పెడల్‌ బేస్డ్‌ శానిటైజర్‌ స్టాండ్‌లను ఏర్పాటుచేయాలని సూచించారు. పర్యాటక కేంద్రాల్లో డిజిటల్‌ పేమెంట్స్‌, ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌, ఆన్‌లైన్‌ పేమెంట్లను అనుమతి ఇవ్వడంతోపాటు పర్యాటకులను ఆ దిశగా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక కేంద్రాలలోని వాష్‌రూంలు, బుకింగ్‌, రిసెప్షన్‌ కౌంటర్లు, ఫర్నిచర్‌ను, పర్యాటకశాఖ బస్సు సీట్లను విధిగా శానిటైజర్‌తో శుభ్రపరచాలని చెప్పారు. బస్సుల్లో పర్యాటకులు భౌతికదూరం పాటించేలా సీట్లు ఏర్పాటుచేయాలని టూర్‌ అపరేటర్లను ఆదేశించారు. కొవిడ్‌ నిబంధనలను సూచిస్తూ పర్యాటక ప్రాంతాల్లో సైన్‌ బోర్డులు ఏర్పాటుచేయాలని సూచించారు.logo