గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 03:15:14

ఆన్‌లైన్‌లోకి 24.56 లక్షల ఇండ్లు

ఆన్‌లైన్‌లోకి 24.56 లక్షల ఇండ్లు

  • 57.74 శాతంతో వనపర్తి టాప్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. గ్రామాల్లో ఇప్పటివరకు 24.56 లక్షల ఇండ్లను ఆన్‌లైన్‌లో ఎక్కించడం పూర్తయింది. శనివారం నాటికి ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్దేశించగా.. ఆ సమయానికి ముందే ఈ-పంచాయతీ పోర్టల్‌లో ఇండ్ల వివరాలను నమోదుచేశారు. సాంకేతిక సమస్యల కారణంగా ఆ వివరాలను టీఎస్‌ఎన్‌ఏపీ యాప్‌లోకి ఎక్కించడం ఆలస్యమవుతున్నది. ఈ నెల 3న యాప్‌ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి రోజుకు సగటున రెండు లక్షల ఇండ్లను మాత్రమే ఆన్‌లైన్‌లోకి ఎక్కించడం సాధ్యమయింది. అధికారులు సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో రెండురోజులుగా నమోదు ప్రక్రి య ఊపందుకున్నది. గురువారం నాటి కి 13.14 లక్షల ఇండ్లే నమోదుచేయగా.. శుక్రవారం నాటికి ఆ సంఖ్య 24.56 లక్షలకు పెరిగింది. ఇదేవేగంతో చేస్తే వారంరోజుల్లో ప్రక్రియ ముగుస్తుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.  

యజమానికి ముందే సమాచారం

గ్రామ పంచాయతీల్లో మొత్తం 62.24 లక్షల ఇండ్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటిలో 24.56 లక్షల ఇండ్ల ఆన్‌లైన్‌ పూర్తికాగా.. మిగిలినవాటిని ఎక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో నమో దు చేసేందుకు పంచాయతీ కార్యదర్శి ఇంటివద్దకు వెళ్తున్న సమయంలో యజమాని అందుబాటులో లేపోవడంతో ప్రక్రియ ఆలస్యమవుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఇంటి యజమానికి ఒకరోజు ముందే సమాచారమివ్వాలని డీపీవోలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. 

వనపర్తి టాప్‌

ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియలో వనపర్తి జిల్లా 57.74 శాతంతో మొదటిస్థానంలో ఉన్నది. జోగుళాంబ గద్వాల (52.13), మెదక్‌ (50.72), ఖమ్మం (48.40), మంచిర్యాల (47.09) టాప్‌-5లో ఉన్నాయి.logo