శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 21:03:46

సీఎం అధ్యక్షతన రేపు ఉన్నతస్థాయి సమావేశం..

సీఎం అధ్యక్షతన రేపు ఉన్నతస్థాయి సమావేశం..

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో అత్యున్నత సమావేశం జరగనున్నది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు హాజరవనున్నారు. మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితారెడ్డి, మల్లారెడ్డి, డిప్యూటి స్పీకర్‌ పద్మారావు, వైద్యారోగ్య శాఖ, పంచాయతీరాజ్‌ శాఖ, మున్సిపల్‌ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు ఈ సమావేశానికి హాజరవుతారు. 

ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన కొంతమంది విదేశీయులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలియడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికే వైరస్‌ సోకుతున్నందువల్ల వారికి సంపూర్ణ వైద్య పరీక్షలు నిర్వహించాలనీ, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పుడే వారిని ఎయిర్‌పోర్టు నుంచి అనుమతించాలని సీఎం కోరారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నదని సీఎం తెలిపారు. ప్రజలు స్వీయ ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. జనం గుమిగూడే కార్యక్రమాలు, వేడుకలు రద్దు చేసుకోవాలని సీఎం ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలు అర్థం చేసుకొని, రాష్ర్టాన్ని కాపాడుకుందామని సీఎం తెలియజేశారు. 


logo