శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 11, 2021 , 02:11:13

సంక్షేమ రంగవల్లులు

సంక్షేమ రంగవల్లులు

  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

బోధన్‌, జనవరి 10: ముగ్గుల పోటీలు సృజనాత్మకతకు అద్దం పడతాయని, కానీ బోధన్‌లో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో సృజనాత్మకతతోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు తెలంగాణ సామాజికాంశాలు ప్రతిబింబించాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం బోధన్‌ పట్టణ శివారులో రుద్ర కన్‌స్ట్రక్షన్స్‌ ప్రాంగణంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. 295 మంది మహిళలు, విద్యార్థినులు వేసిన ముగ్గులను కవిత పరిశీలించారు. అనంతరం సభలో ఆమె మాట్లాడుతూ.. అనేక ముగ్గులను సీఎం కేసీఆర్‌ బొమ్మలతో తీర్చిదిద్దిన ఆడబిడ్డలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

మాటల పోశెట్టి ఎవరో తెలుసు.. 

ప్రజల కోసం పని చేసే నాయకులు ఎవరో ప్రజలకు తెలుసని, ఎవరు ఏం మాట్లాడుతున్నారో వారు గమనిస్తున్నారని కల్వకుంట్ల కవిత అన్నారు. ఇటీవల బోధన్‌లో జరిగిన బీజేపీ సభలో ఆ పార్టీ నాయకుల మాటలను ఆమె పరోక్షంగా ప్రస్తావిస్తూ.. మాటల పోశెట్టి ఎవరో తెలిసిపోయిందని ఎద్దేవాచేశారు. రెంజల్‌ మండలంలోని తాడ్‌బిలోలి సర్పంచ్‌ సునీత, సీనియర్‌ నాయకుడు నర్సయ్య కాంగ్రెస్‌ను వీడి కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే షకీల్‌ పాల్గొన్నారు.  

రేపు తెలంగాణ జాగృతి ముగ్గుల పోటీలు

హైదరాబాద్‌: తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు హైదరాబాద్‌ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు పోటీలు జరుగుతాయని  మహిళా విభాగం అధ్యక్షురాలు ఎం వరలక్ష్మి తెలిపారు. మొదటి ముగ్గురు విజేతలకు ఆకర్షణీయ బహుమతులు, పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతులు ఉంటాయన్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం శైలజారావు (95059 42801), కవిత (98493 90560), సుచిత్ర (93463 51287)లను ఫోన్‌లో సంప్రదించాలని సూచించారు.  


logo