మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 18:31:09

సీఎం కేసీఆర్‌ను కలిసిన చిరంజీవి, నాగార్జున..

సీఎం కేసీఆర్‌ను కలిసిన చిరంజీవి, నాగార్జున..

తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలతో ఎప్పటికప్పుడు భేటీ అవుతూనే ఉంటారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అక్కడ ఏం జరుగుతుంది.. ఏదైనా సమస్యలున్నాయా అంటూ వాకబు కూడా చేస్తుంటారు. మరోవైపు ఇండస్ట్రీ నుంచి ఎప్పటికప్పుడు పెద్దలు వచ్చి సిఎంతో భేటీ అవుతుంటారు. ప్రతీ చిన్న విషయాన్ని కూడా చెప్తుంటారు.. ఏదైనా సాయం కావాల్సినపుడు వచ్చి అడుగుతుంటారు. అలా ఇండస్ట్రీ నుంచి ఎప్పుడూ సీఎంను కలిసే వాళ్ల లిస్టులో చిరు, నాగార్జున ముందుంటారు. తాజాగా మరోసారి వాళ్లు కేసీఆర్ తో భేటీ అయ్యారు. తాజాగా ప్రగతి భవన్ లోనే ముఖ్యమంత్రిని కలిసి కొన్ని విషయాలు చర్చించారు చిరు, నాగ్. ఆ మధ్య లాక్‌డౌన్ సమయంలో కూడా ఇలాగే ముఖ్యమంత్రిని కలిసారు ఈ ఇద్దరూ. ఇప్పుడు మరోసారి ఇదే చేసారు. 

మొన్నామధ్య హైదరాబాద్‌ను అతలాకుతలం చేసిన వరదలలో ఎంతోమంది నష్టపోయారు.. ఆర్థికంగా కూడా వేల కోట్ల నష్టం వచ్చింది. ఇందులో ఎంతోమంది నిరాశ్రయులయ్యారు.. పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా పోయాయి. దాంతో వాళ్లను ఆదుకోడానికి తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకొచ్చింది. సిఎం రిలీఫ్ ఫండ్‌కు మన హీరోలు చాలా మంది లక్షలు, కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. వాటిని ముఖ్యమంత్రికి అందించడానికి కేసీఆర్ ను కలిసారు చిరంజీవి, నాగార్జున. అలాగే ఎలాంటి సాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ హీరోలు ఇండస్ట్రీ తరఫు నుంచి ముఖ్యమంత్రికి చెప్పినట్లు తెలుస్తుంది. దాంతో పాటు తెలంగాణలో థియేటర్స్ ఓపెనింగ్ గురించి కూడా చర్చకు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.