గురువారం 04 మార్చి 2021
Telangana - Jan 19, 2021 , 02:25:21

నేడు లక్ష మందికి టీకాలు!

నేడు లక్ష మందికి టీకాలు!

  • ప్రతి కేంద్రంలో 100 మందికి ఇవ్వడమే లక్ష్యం
  • వచ్చేవారం నుంచి ప్రైవేటు దవాఖానల్లో కూడా
  • కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ పంపిణీపై రాని స్పష్టత
  • ఇకపై వ్యాక్సినేషన్‌ వివరాలతో టీకా బులెటిన్‌

హైదరాబాద్‌/ పాలకుర్తి రూరల్‌  జనవరి 18 (నమస్తే తెలంగాణ): కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భాగంగా మంగళవారం లక్ష మం దికిపైగా హెల్త్‌కేర్‌ సిబ్బందికి టీకాలు వేయాలని వైద్యారోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో 30 మందికి, రెండోరోజు 50 మందికి టీకాలు ఇచ్చారు. మంగళవారం ఒక్కో కేంద్రంలో వంద మందికి చొప్పు వేయాలని నిర్ణయించింది. ఇం దుకోసం కొవిడ్‌ టీకాల కేంద్రాల సంఖ్యను 1034కు పెంచింది. ఇప్పటికే 33 జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. అవసరమైన డోసులు టీకా కేంద్రాలకు చేరుకున్నాయి. కోఠిలోని సెంట్రల్‌ టీకా కేంద్రం నుంచి రెండు రోజుల్లో మొత్తం 1.70లక్షల కొవిషీల్డ్‌ డోసులు తరలించడం పూర్తయింది. రెండో దశలో భాగంగా పుణె నుంచి వచ్చే టీకాలను అవసరాన్ని బట్టి జిల్లాలకు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. ఇక కొవాగ్జిన్‌ పంపిణీ ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. ప్ర స్తుతం ప్రభుత్వ దవాఖానల్లోనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తామని, వచ్చే వారం ప్రైవేటు దవాఖానల్లోనూ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు కరోనా కేసుల వివరాలతో కూడిన బులెటిన్‌ ఇస్తున్నట్టుగానే టీకాల కార్యక్రమంపై వెలువరిస్తామని తెలిపారు. 

సోమవారం 82శాతం లక్ష్యం

టీకాల లక్ష్యం సోమవారం 82శాతం చేరుకున్నట్టు వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. 33 జిల్లాల్లో 335 టీకా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 16,750 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ వేయాలని లక్ష్యంగా ఏర్పరుచుకోగా, 13,666 మందికి వేశారు. టీకాలు వేసుకున్న 15 మందిలో స్వల్ప లక్షణాలు ఏర్పడినా.. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. వ్యాక్సిన్‌ పొందినవారిలో 1700 మందికి పైగా ఆర్మీ, 121 మంది ఎయిర్‌ఫోర్స్‌, 24 మంది క్లాస్‌-4 విభాగాలకు చెందిన హెల్త్‌కేర్‌ వర్కర్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు

కరోనా టీకాల పంపిణీకి ఉపయోగిస్తున్న కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా సోమవారం పలుచోట్ల టీకాల పంపిణీలో జాప్యం జరిగింది. హైదరాబాద్‌ ఛాతి దవాఖానలో లబ్ధిదారుల వివరాలను మాన్యువల్‌గా నమోదు చేశారు. లబ్ధిదారుల సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు వెళ్లకపోవటంతో సిబ్బంది ఫోన్లుచేసి వారిని పిలిపించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఇలాంటి సమస్యలే ఎదురైనట్టు ఆయా జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కేవలం 50 మంది లబ్ధిదారులకు వేసే కార్యక్రమంలో ఇంత ఆలస్యమైతే భవిష్యత్‌లో ఒక్కో కేంద్రంలో 100, 150 మందికి టీకాలు వేయాల్సి ఉంటుందని, అప్పుడు ఈ సమస్యలు మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఏపీలో వ్యాక్సిన్‌ తర్వాత అస్వస్థత 

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ టీకా తీసుకున్న ఇద్దరు ఆశావర్కర్లు రాణి, సుశీల అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. భీమడోలు ప్రభుత్వ దవాఖానలో ఈ నెల 16న  టీకా తీసుకున్న వీరిద్దరూ రెండురోజులుగా తలనొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. ఏ మాత్రం తగ్గకపోవడంతో వారిని కుటుంబసభ్యులు ఏలూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 


VIDEOS

logo