బుధవారం 03 జూన్ 2020
Telangana - May 02, 2020 , 02:31:08

సొరంగంలో జల తరంగం

సొరంగంలో జల తరంగం

  • నేడు మల్లన్నసాగర్‌ సొరంగంలోకి.. 
  • అక్కడి నుంచి కొండపోచమ్మ దిశగా కాళేశ్వర జలాలు
  • 16 కిలోమీటర్ల టన్నెల్‌ ప్రాజెక్టులో ఇదే సుదీర్ఘం

పాతాళం నుంచి ఉబికుబికి వస్తున్న గంగమ్మను మరోసారి నెత్తిన పెట్టుకోవడానికి కొమురెల్లి మల్లన్న తన జటలన్నీ విచ్చుకొని ఆత్రంగా చూస్తున్నాడు. సోదరి తనచెంతకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని కొండపోచమ్మ తల్లి వేయి కండ్లతో ఎదురుచూస్తున్నది.  మేడిగడ్డ నుంచి 170 కిలోమీటర్లు సుదీర్ఘంగా ప్రయాణించిన కాళేశ్వర గంగ ఎత్తుపల్లాలన్నింటినీ అధిగమిస్తూ.. రంగనాయకసాగర్‌కు చేరుకొని రంగనాయకుడి పాదాలను కడిగింది. అక్కడి నుంచి మరింత ఎత్తుకు పయనిస్తూ.. శనివారం పదహారు కిలోమీటర్లకు పైగా ఉన్న సుదీర్ఘ సొరంగంలోకి ప్రవేశించనున్నది. అక్కడినుంచి మొత్తం 18 కిలోమీటర్లు ప్రయాణించి ముందుగా కొమురెల్లి మల్లన్న పంప్‌హౌజ్‌ను స్పృశించి.. ఆ తర్వాత కొండపోచమ్మవైపు ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. 

హైదరాబాద్‌/ గజ్వేల్‌, నమస్తే తెలంగాణ, తొగుట: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నేడు మరో అడుగుపడనున్నది. మేడిగడ్డ నుంచి సుదీర్ఘ ప్రయాణంతో 170 కిలోమీటర్ల దూరంలోని రంగనాయకసాగర్‌ చేరుకున్న కాళేశ్వరగంగ శనివారం 16.2 కిలోమీటర్ల పొడవైన సొరంగంలోకి ప్రవేశించనున్నది. పద్దెనిమిది కిలోమీటర్లు ప్రయాణించి కొమురవెళ్లి మల్లన్న పంప్‌హౌజ్‌కు చేరుకుని.. అక్కడ్నుంచి కొండపోచమ్మ దిశగా వేగంగా ముందుకుసాగనున్నది. ఉదయం పదిన్నర గంటలకు రంగనాయక్‌సాగర్‌ తూము గేట్లుఎత్తి గోదావరి జలాలను సొరంగంలోకి విడుదల చేసేందుకు కాళేశ్వరం ఈఎన్సీ హరిరాం, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా రంగనాయక్‌సాగర్‌లోకి గోదావరి జలాల తరలింపు కొనసాగుతున్నది. గత నెల 24న మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు చంద్లాపూర్‌ పంప్‌హౌజ్‌లోని మోటర్ల ద్వారా రంగనాయక్‌సాగర్‌లోకి నీటిని ఎత్తిపోసే ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. అంచెలంచెలుగా మూడుమోటర్ల ట్రయల్న్‌న్రు పూర్తిచేసిన అధికారులు నాటినుంచి రంగనాయకసాగర్‌లోకి ఎత్తిపోతలు కొనసాగిస్తున్నారు. నాలుగోమోటర్‌ ట్రయల్న్‌క్రు కూడా సిద్ధం చేస్తున్నారు. మూడు టీఎంసీల నిల్వసామర్థ్యం ఉన్న జలాశయంలో దాదాపు 1.7 టీఎంసీల నీటినిల్వ ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి జలాశయం 0.8 టీఎంసీలకు చేరుకున్నది. రంగనాయక్‌సాగర్‌ నుంచి కొండపోచమ్మ దిశగా జలాలను తీసుకెళ్లడంలో భాగంగా శనివారం 16.2 కిలోమీటర్ల పొడవున్న సొరంగంలోకి విడుదల చేయనున్నారు. ఉదయం పదిన్నరకు సొరంగం గేట్లు తెరిచి జలాలను వదులుతారు. తొమ్మిది మీటర్ల వ్యాసార్థం కలిగిన సొరంగంలోకి నీటి పరిమాణాన్ని క్రమక్రమంగా పెంచుతారు. దీనిని సాంకేతికంగా చార్జ్‌ చేయడం అంటారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఇప్పటివరకు నిర్మాణం పూర్తయిన సొరంగాల్లో ఇదే పెద్దది. దీనికంటే దాదాపు రెండు కిలోమీటర్ల ఎక్కువ పొడవున్న సొరంగాన్ని మల్లన్నసాగర్‌-సింగూరుకు జలాల తరలింపులో భాగంగా ప్యాకేజీ-13లో చేపట్టనున్నారు. దాని నిర్మాణం పూర్తయితే తాజాగా నీటిని వదిలే సొరంగం రెండవది కానున్నది.

మరో మూడగుల దూరంలో.. 

రంగనాయకసాగర్‌ నుంచి సొరంగమార్గం ద్వారా జలాలు సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌ వద్దఉన్న కొమురవెల్లి మల్లన్న సర్జ్‌పూల్‌కు చేరుకుంటాయి. అందులో నిర్ణీతమట్టానికి చేరుకున్నాక పంపుహౌజ్‌లోని మోటర్ల డ్రాఫ్ట్‌బ్యూల్‌లోకి జలాలను వదులుతారు. అక్కడికి నీళ్లు చేరుకున్న తర్వాత పంప్‌హౌజ్‌లో 43 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఎనిమిది మోటర్ల ట్రయల్న్‌క్రు అధికారులు సాంకేతికంగా సిద్ధమవుతారు. వాస్తవంగా ఈ పంపుహౌజ్‌లోని మోటర్ల ద్వారా మల్లన్నసాగర్‌ జలాశయంలోకి నీటిని ఎత్తిపోయాల్సి ఉన్నది. కానీ దాని నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఫీడర్‌ చానెల్‌ ఏర్పాటుచేసి.. నేరుగా 18.5 కిలోమీటర్లు కాల్వద్వారా గజ్వేల్‌ మండలం అక్కారం వద్ద నిర్మించిన పంపుహౌజ్‌కు తరలించనున్నారు. అక్కడ ఆరు మోటర్లతో ఎత్తిపోయడం ద్వారా మర్కూక్‌ పంపుహౌజ్‌కు తరలిస్తారు. మర్కూక్‌ పంపుహౌజ్‌లోనూ ఏర్పాటుచేసిన ఆరుమోటర్లతో అత్యంత ఎత్తయిన కొండపోచమ్మసాగర్‌లోకి గోదావరి జలాలు ప్రవేశిస్తాయి. రంగనాయకసాగర్‌ నుంచి మూడుదశల్లో ఎత్తిపోత ద్వారా కొండపోచమ్మసాగర్‌కు కాళేశ్వరగంగ చేరుతుంది. మధ్యలో నీటినిల్వ చేసే జలాశయాలేవీ లేనందున ఈ ప్రక్రియను రోజుల వ్యవధిలోనే పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే తుక్కాపూర్‌, అక్కారం, మర్కూక్‌ సబ్‌స్టేషన్లకు విద్యుత్‌ కనెక్షన్లు పూర్తయ్యాయి. ఈనెల రెండోవారంలోనే కాళేశ్వరజలాలు కొండపోచమ్మసాగర్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్నది. రూ.1540 కోట్లతో నిర్మించిన కొండపోచమ్మసాగర్‌తో ఐదు జిల్లాల్లోని 2,85,280 ఎకరాలు సాగులోకి రానున్నాయి.logo