శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 09:06:31

గొర్రెకుంట మృత్యుబావి కేసులో నేడు తీర్పు

గొర్రెకుంట మృత్యుబావి కేసులో నేడు తీర్పు

వ‌రంగ‌ల్ గ్రామీణం: రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన గొర్రెకుంట మృత్యుబావి కేసులో ఇవాళ‌ తుది తీర్పు వెలువ‌డ‌నుంది. బావిలో ప‌డేసి తొమ్మిది మందిని హ‌త్య‌చేసిన కేసులో ఇప్ప‌టికే విచార‌ణ పూర్త‌య్యింది. దీంతో జిల్లా అద‌న‌పు కోర్టు ఈరోజు తీర్పు వెల్ల‌డించ‌నుంది. బీహార్‌కు చెందిన సంజ‌య్ కుమార్ మే 21న తొమ్మిది మందిని హ‌త్య‌చేసి వరంగల్ శివారులోని గీసుకొండలోని గొర్రెకుంట బావిలో పడేసి జ‌ల‌స‌మాధి చేశాడు. 

పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా వరంగల్‌కు వలస వచ్చాడు. నగరంలోని కరీమాబాద్‌ ప్రాంతంలో వీరంతా అద్దె ఇంట్లో ఉండేవారు. ఇక డిసెంబర్ నుంచి వీరు గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గోనె సంచుల తయారీ గోదాంలో పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వరంగల్‌ నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో.. నెలన్నర నుంచి గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్‌ కుటుంబం ఉంటోంది. భర్తతో విడిపోయిన మక్సూద్ భార్య చెల్లెలు బుస్రా ఆలం కూడా తన మూడేళ్ల కుమారుడితో వారి వద్ద ఉంటోంది. వీరితో పాటుగా గన్నీ సంచుల గొదాం పక్కనే ఉన్న పైభవనంలో బీహార్‌కి చెందిన శ్రీరాం, శ్యాంలు ఉన్నారు. ఇక నగరంలోని సంజయ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తితో బుస్రాకు వివాహేతర సంబంధం ఉండగా.. ఈ విషయంలో తరచుగా మక్సూద్ ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఇంటిపై ఉంటున్న శ్రీ రాం, శ్యామ్‌లు వీరి గొడవలో జోక్యం చేసుకుని బుస్రాపై కన్నేసినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ కుమార్ పథకం ప్రకారం తొమ్మిది మందిని హతమార్చాడు.

మృతులెవరంటే..

గొర్రెకుంట శివారులోని సుప్రియ కోల్డ్‌ స్టోరేజీ సమీపంలోని బార్‌దాన్‌ కుట్టే గోదాంలో పనిచేసే మహ్మద్‌ మక్సూద్‌ ఆలం (55), అతడి భార్య నిషా ఆలం (45), కూతురు బుష్రా ఖాతూన్ ‌(20), మక్సూద్‌ కుమారులు షాబాజ్‌ ఆలం (19), సోహిల్‌ ఆలం (18)తో పాటు అదే ఖార్ఖానాలో పనిచేసే బిహార్‌ వలస కార్మికులు శ్యాం కుమార్‌షా (21), శ్రీరాం కుమార్‌షా (26) , మక్సూద్‌కు సన్నిహితుడైన మహ్మద్‌ షకీల్ ‌(30) అనే డ్రైవర్  ఉన్నారు.