హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో మరో 4 రోజులు భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొంది. ఉత్తర ఒడిశా నుంచి ఇంటీరియర్ ఒడిశా వరకు తెలంగాణ మీదుగా సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద బుధవారం ఏర్పడిన ఉపరితల ద్రోణితోపాటు మంగళవారం ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీన పడటంతో రాష్ట్రంలో జోగులాంబ గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో వర్షం కురిసింది. గత 24 గంటల్లో అత్యధికంగా ఖమ్మం జిల్లా వేంపూర్లో 10.73 సెం.మీ., సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కామ్కోల్లో 10.10 సెం.మీ., మొగ్దంపల్లిలో 9.33 సెం.మీ., ఉప్పల్‌లోని రాజీవ్‌నగర్‌లో 5 సెం.మీ. వర్షం నమోదైంది.