బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 01:46:35

స్పందిద్దాం..సాయమందిద్దాం

స్పందిద్దాం..సాయమందిద్దాం

  • వరద సహాయ చర్యల్లో పాల్గొందాం
  • ఉద్యోగులకు టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ పిలుపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ సుల్తాన్‌బజార్‌: తెలంగాణ ఉద్యోగులంతా సామాజిక బాధ్యతగా వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ పిలుపునిచ్చారు. విపత్కర కాలంలో ప్రజలకు సాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తామని చెప్పారు. మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీవోభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఎన్జీవో హైదరాబాద్‌ జిల్లా, నగర, రంగారెడ్డి జిల్లా శాఖల తరపున ఉద్యోగులు ఇప్పటికే పెద్దఎత్తున సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. సేవ చేయడంలో టీఎన్జీవో ముందువరుసలో ఉంటుందని చెప్పారు. ఉద్యోగులు తాము నివసిస్తున్న పలు కాలనీల్లో ఆపన్నహస్తం అందించాలని రాజేందర్‌ కోరారు. ఈ సమావేశంలో టీఎన్జీవో కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎం సత్యనారాయణగౌడ్‌, కొండల్‌రెడ్డి, శైలజ, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌ హుస్సేని, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆర్‌ లక్ష్మణ్‌, హైదరాబాద్‌ నగరశాఖ అధ్యక్షుడు ఎస్‌ శ్రీరామ్‌ పాల్గొన్నారు. 

రేపు జేఏసీ సమావేశం

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ గురువారం సమావేశం కానున్నట్టు రాజేందర్‌ తెలిపారు. సమావేశంలో చర్చించి వరద బాధితుల సహాయం కోసం సీఎంఆర్‌ఎఫ్‌కు తమవంతుగా ఆర్థికసాయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. తాను, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌ ఒకనెల వేతనాన్ని సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రకటించారు.

సాయంపై అడ్వకేట్‌ జేఏసీ హర్షం

వరద ముప్పు ఎదుర్కొంటున్న బాధితులకు సీఎం కేసీఆర్‌ అండగా నిలిచారని అడ్వకేట్‌ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. బాధితులకు ఆర్థికసాయం ప్రకటించడంపై అడ్వకేట్‌ జేఏసీ కన్వీనర్‌ కొంతం గోవర్ధన్‌రెడ్డి, సీహెచ్‌ ఉపేందర్‌, రవికుమార్‌ తదితరులు మంగళవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు.