శనివారం 06 మార్చి 2021
Telangana - Jan 21, 2021 , 00:47:23

70 శాతం పదోన్నతులు పూర్తి

70 శాతం పదోన్నతులు పూర్తి

  • త్వరలో పీఆర్సీ వస్తుందని ఆశిస్తున్నాం
  • సీఎం ప్రకటనపై మాకు నమ్మకమున్నది
  • సీఎస్‌ను కలిసిన టీఎన్జీవో, టీజీవో నేతలు

హైదరాబాద్‌, జనవరి 20, (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ 70 శాతం పూర్తయిందని, కొద్ది రోజుల్లో మిగతా ప్రక్రియ పూర్తవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. బుధవారం బీఆర్కే భవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను కలిసిన అనంతరం టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, టీజీవో అధ్యక్షురాలు వీ మమత మీడియాతో మాట్లాడారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. ఇప్పటికే చాలామంది ఉద్యోగులు పదోన్నతులు పొందారని తెలిపారు. ప్రభు త్వం కనీస సర్వీసును మూడు నుంచి రెండేండ్లకు తగ్గించడంతో ఎక్కువమందికి పదోన్నతులు లభిస్తున్నాయన్నారు. ఎక్కువమంది ఉద్యోగులు పదోన్నతి పొందేలా నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జనవరి మూడో వారంలో పీఆర్సీ ఉంటుందని సీఎం కేసీఆర్‌ చెప్పారని, ఇందులో భాగంగానే తాము సీఎస్‌ను కలిశామని వెల్లడించారు. ప్రభుత్వం ఉద్యోగులతో సఖ్యతగానే ఉన్నదన్నారు.

పీఆర్సీపై అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని సీఎస్‌ను కోరామని తెలిపారు. పీఆర్సీ నివేదికను బహిర్గతపరచాలని, ఉద్యోగ సంఘాలకు పీఆర్సీ నివేదిక కాపీ అందించాలని కోరామన్నారు. రెండు మూడు రోజుల్లో పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటుచేస్తామని సీఎస్‌ చెప్పారని నేతలు వెల్లడించారు. అతిత్వరలో పీఆర్సీ వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.  ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి రప్పించే చర్యలు వేగవంతం చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పదవీవిరమణ వయసును పెంచాలని సీఎస్‌ను కోరామన్నారు. ఖాళీగా ఉన్న 50 వేల ఉద్యోగాలను వెం టనే భర్తీ చేయాలని విజ్ఞప్తిచేశామని పేర్కొన్నారు. సీఎస్‌ను కలిసిన వారిలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్‌, టీజీవో ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

VIDEOS

logo