e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home తెలంగాణ మీ స్వార్థానికి మమ్మల్ని బలిపెట్టొద్దు

మీ స్వార్థానికి మమ్మల్ని బలిపెట్టొద్దు

మీ స్వార్థానికి మమ్మల్ని బలిపెట్టొద్దు
  • ఆర్టీసీపై, ఎమ్మెల్సీ కవితపైఅనుచిత వ్యాఖ్యలు సహించం
  • కార్మికులు ఆమె నాయకత్వాన్ని కోరుకొంటున్నారు
  • సీఎం కేసీఆర్‌ పెద్ద మనసుతోనే ఆర్టీసీ బతుకుతున్నది
  • నష్టాల పేర సంస్థలను ప్రధాని మోదీ మూయిస్తున్నరు
  • ఈటలపై టీఎంయూ నాయకుడు థామస్‌రెడ్డి ధ్వజం

హైదరాబాద్‌, జూన్‌ 5 (నమస్తే తెలంగాణ): రాజకీయ ప్రయోజనాల కోసమే ఈటల రాజేందర్‌ ఆర్టీసీపై, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆర్టీసీ టీఎంయూ జనరల్‌ సెక్రటరీ థామస్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇన్నేండ్లు మంత్రిగా ఉన్నా ఆర్టీసీకి ఈటల చేసిందేమీ లేదని, ఇప్పుడు తన రాజకీయాల కోసం అవాకులుచెవాకులు మాట్లాడితే సహించేది లేదని స్పష్టంచేశారు. తీరు మార్చుకోకపోతే తాము కూడా ప్రజల్లోకి వెళ్లి మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆస్తులను కాపాడుకునేందుకు, కుటుంబ భవిష్యత్తు కోసమే ఈటల బీజేపీలో చేరబోతున్నారని దుయ్యబట్టారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ టీఎంయూ అధ్యక్షుడు కమలాకర్‌గౌడ్‌ తదితరులతో కలిసి థామస్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటుచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులంతా ఉద్యమ సారథి కేసీఆర్‌తో కలిసి తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిజాయితీగా పోరాడారని గుర్తుచేశారు. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ను తాను, మంత్రి హరీశ్‌రావు కలిసి పెట్టించామంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తమని అన్నారు. సకల జనుల సమ్మె తర్వాత ఉద్యమ నేత కేసీఆర్‌ ఆలోచనతోనే టీఎంయూ పురుడుపోసుకున్నదని స్పష్టంచేశారు. కేసీఆర్‌ ఆదేశాలతోనే హరీశ్‌రావు గౌరవాధ్యక్షుడిగా కొనసాగారని, కొన్ని చట్టపరమైన అనివార్యపరిస్థితుల్లోనే ఆయన తప్పుకున్నారని వివరించారు. స్వయంకృతాపరాధంతోనే అశ్వత్థామరెడ్డి స్వచ్ఛందంగా రాజీనామా చేశారని వెల్లడించారు. కవిత ఎంపీగా పనిచేసిన తీరు, ఎమ్మెల్సీగా ఇప్పుడు సేవలందిస్తున్న విధానాన్ని చూసి ఆర్టీసీ ఉద్యోగులు, సింగరేణి, విద్యుత్తు కార్మికులే ఆమెను తమ నాయకురాలిగా ఉండాలని కోరుకొంటున్నారని తెలిపారు.

ఇప్పటికే తాము పలుమార్లు ఎమ్మెల్సీ కవితను కలిసి తమకు గౌరవ అధ్యక్షురాలుగా ఉండాలని కోరామని, ‘పార్టీ నిర్ణయమే శిరోధార్యం, సీఎం కేసీఆర్‌ ఆదేశిస్తేనే తాను ఉంటా’ అని ఆమె బదులిచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ పబ్లిక్‌ సెక్టార్‌ జేఏసీ చైర్మన్‌గా కవిత ఢిల్లీలో చేసిన కృషిని మరవవద్దని చెప్పారు. ఉద్యోగుల విభజన, ఆర్టీసీ ఆస్తుల విభజన విషయంలో ముఖ్యపాత్ర పోషించారు కాబట్టే సంస్థ ఉద్యోగులంతా కవిత నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఈటల మారకపోతే తాము అవసరమైతే హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఆర్టీసీ ఉద్యోగులుగా ప్రజలకు నిజాలు చెప్తామని పేర్కొన్నారు.

ఏ ఆత్మగౌరవంతో బీజేపీలోకి వెళ్తున్నారు?

ఈటల రాజేందర్‌ పెద్దమొత్తంలో ఆస్తులు కూడబెట్టారని.. భూములు కబ్జాచేశారని మీడియాలో చూశామని, అవి ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలని థామస్‌రెడ్డి డిమాండ్‌చేశారు. ఆయన ఆస్తుల రక్షణ కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, వ్యాపారాల కోసం మాట్లాడుకోవాలని, కానీ 49 వేల మంది ఉద్యోగులు ఆధారపడి ఉన్న ఆర్టీసీని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బలిచేయవద్దని హితవుపలికారు. ‘ఏ ఆత్మగౌరవంతో బీజేపీలో మీరు చేరబోతున్నారు? నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలలను అమ్మేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారు కదా?.. మీరు బీజేపీలో చేరితే నష్టాల్లో ఉన్న మా ఆర్టీసీని కాపాడేందుకు ఏం చేస్తారు? సింగరేణి, ఎల్‌ఐసీ వంటి సంస్థలను కాపపాడుతారా? రవాణా పన్నును రద్దు చేస్తారా?.. తెలంగాణలో ఆర్టీసీ అన్యాక్రాంతం అయితే రాష్ట్రంలోని పేదలు, బడుగు, బలహీనవర్గాలవారికి రవాణా సదుపాయం ఎలా? వాళ్లకు ఎలా న్యాయం చేస్తారు?’ అని ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని అమ్మేయడం సీఎం కేసీఆర్‌కు మూడు నిమిషాల పని అని, కానీ సంస్థపై అమితమైన ప్రేమ ఉన్నది కాబట్టే రక్షిస్తూ ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు.

నష్టాల్లో ఉన్న సంస్థకు ప్రతి నెలా రూ.100 కోట్లు ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పారు. ఈసారి బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.3 వేల కోట్లు పెట్టి ఇటీవలే రూ.వెయ్యి కోట్ల బ్యాంక్‌ గ్యారంటీ రుణానికి సంబంధించి జీవో ఇచ్చిన విషయం తెలియదా? అని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వాకి, సీఎం కేసీఆర్‌కు ఆర్టీసీ ఉద్యోగులంతా అండగా ఉంటారని స్పష్టంచేశారు. సమావేశంలో టీఎంయూ చీఫ్‌ అడ్వైజర్లు మల్లయ్య, బీ యాదయ్య, ఉపాధ్యక్షుడు జీపీఆర్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు శంకరయ్య, అలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మీ స్వార్థానికి మమ్మల్ని బలిపెట్టొద్దు

ట్రెండింగ్‌

Advertisement