సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 17:41:26

అశ్వ‌త్థామ‌రెడ్డి రాజీనామా చేయాలి.. టీఆర్ఎస్ వెంటే టీఎంయూ

అశ్వ‌త్థామ‌రెడ్డి రాజీనామా చేయాలి.. టీఆర్ఎస్ వెంటే టీఎంయూ

  • కార్మికుల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు
  • బీజేపీలోకి వెళ్లేందుకు అశ్వ‌త్థామ‌రెడ్డి య‌త్నం
  • ఆర్టీసీని ర‌క్షించేది ప్ర‌భుత్వం మాత్ర‌మే

హైద‌రాబాద్ : తెలంగాణ మ‌జ్దూర్ యూనియ‌న్(టీఎంయూ) జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ అశ్వ‌త్థామ‌రెడ్డి నైతికంగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగానే  టీఎంయూ కొన‌సాగుతోంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. బీజేపీలో ఎమ్మెల్సీ సీటు పొందేందుకు అశ్వ‌త్థామ రెడ్డి టీఎంయూ కార్మికుల‌ను ఉప‌యోగించుకున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. జితేంద‌ర్ రెడ్డిని టీఎంయూ అధ్య‌క్షుడిగా చేసి.. త‌న‌కు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వి ఇస్తాన‌ని, ఆ త‌ర్వాత బీజేపీలోకి వెళ్దామ‌ని అశ్వ‌త్థామ‌రెడ్డి చెప్పిన‌ట్లు థామ‌స్ రెడ్డి వెల్ల‌డించారు. హ‌బ్సిగూడ‌లోని టీఎంయూ కార్యాల‌యంలో ఆ యూనియ‌న్ నాయ‌కులు స‌మావేశ‌మై భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణపై చ‌ర్చించారు. ఈ స‌మావేశం ముగిసిన అనంత‌రం థామ‌స్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

'మిగ‌తా యూనియ‌న్లు అన్నీ కార్మికుల స‌మ‌స్య‌ల గురించి ప్ర‌జాస్వామ్యం పంథాలో ముందుకెళ్తుంటే.. స‌మ్మె త‌ర్వాత అశ్వ‌త్థామ‌రెడ్డి ముఖం చాటేశాడు. తెలంగాణ మ‌జ్దూర్ యూనియ‌న్ మాత్రం కార్మికుల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ విష‌యంలో అశ్వ‌త్థామ‌రెడ్డి ఫెయిల్ అయ్యారు. టీఎంయూలో ఉన్న కార్మికులు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. యూనియ‌న్లు ప‌క్క‌న పెట్టి వెల్ఫేర్ క‌మిటీలు వేయాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పిన విష‌యం అందరికీ తెలిసిందే. ఈ విష‌యంలో కార్మికుల‌కు మ‌ద్ద‌తివ్వ‌డంలో అగ్ర నాయ‌క‌త్వం ఫెయిల్ అయింది. స‌మ్మెలో చ‌నిపోయిన కుటుంబాల‌ను అశ్వ‌త్థామ‌రెడ్డి ప‌రామ‌ర్శించ‌లేదు. ఆర్టీసీ కార్మికుల్లో చాలా మందికి క‌రోనా వ‌స్తే కూడా వారిని ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. కార్మికుల‌ను ప‌ట్టించుకోకుండా రోడ్డుపై వ‌దిలేశారు. ట్రాన్స్‌ఫ‌ర్ల గురించి కూడా ఆయ‌న మాట్లాడటం లేదు. 

టీఎంయూ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా కొన‌సాగుతాన‌ని కొంద‌రితో, కొన‌సాగ‌న‌ని కొంద‌రితో చెప్పారు. జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వి నుంచి ప‌క్క‌కు త‌ప్పుకుంటాన‌ని స‌మ్మెకు ముందు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ తామంతా మ‌ద్ద‌తుగా ఉండి.. అశ్వ‌త్థామ‌రెడ్డినే జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా కొన‌సాగ‌మ‌ని చెప్పాము. ప్రెసిడెంట్, ఆయ‌న ఇద్ద‌రు యూనియ‌న్ కార్యాల‌యానికి రావాల‌ని కోరాం. అప్పుడు ఆయ‌న మాట్లాడుతూ.. యూనియ‌న్‌తో, ఆర్టీసీతో త‌న‌కెలాంటి సంబంధం లేద‌ని చెప్పారు. ఇది నిజం కాదా? 

ఆదివారం కేంద్ర క‌మిటీ మీటింగ్ ఏర్పాటు చేసిన అశ్వ‌త్థామ‌రెడ్డి.. ఆయ‌న‌కు మ‌ద్ద‌తివ్వాల‌ని కార్మికుల‌ను బెదిరించారు. ఆ మీటింగ్‌కు మొత్తం 107 మంది కార్మికులు హాజ‌రు కావాలి. కానీ కేవ‌లం 44 మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఇప్ప‌టికైనా అశ్వ‌త్థామ‌రెడ్డి అర్థం చేసుకుని జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వికి నైతికంగా రాజీనామా చేయాల‌ని థామ‌స్ రెడ్డి డిమాండ్ చేశారు. నేను ప్ర‌భుత్వం వ‌ద్ద‌కు వెళ్ల‌ను, దేహి అన‌ను, చేతులు క‌ట్టుకోను. కానీ నేను ఈ ప‌ద‌విలో కొన‌సాగుతాన‌ని నిన్న‌టి మీటింగ్‌లో ఆయ‌న‌ చెప్పారు. 

అశ్వ‌త్థామ‌రెడ్డి మాట‌ల వెనుక పెద్ద ర‌హ‌స్యం ఉంద‌న్నారు. బీజేపీలో ఎమ్మెల్సీ సీటు వ‌చ్చే వ‌ర‌కు యూనియ‌న్ లో కొన‌సాగి.. ఆ త‌ర్వాత బ‌య‌ట‌కు వెళ్లిపోవాల‌ని అనుకుంటున్నారు. అప్ప‌టి వ‌ర‌కు కార్మికులు ఏం కావాలి? మూడు నెల‌ల కింద న‌న్ను పిలిచి.. నీకు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వి ఇస్తా. బీజేపీలోకి వెళ్లిపోదామ‌ని చెప్పాడు. జితేంద‌ర్ రెడ్డిని ప్రెసిడెంట్ చేద్దామ‌ని చెప్పారు. బీజేపీలోకి రావాల్సిన ప‌రిస్థితి నాకు లేదు. తెలంగాణ మ‌జ్దూర్ యూనియ‌న్ టీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘంగానే కొన‌సాగ‌తుంద‌ని చెప్పాను. ప్ర‌భుత్వ అండ‌తోనే ఆర్టీసీ కాపాడ‌బ‌డుతుంది. ఆర్టీసీ కాపాడ‌బడితేనే.. కార్మికుల‌కు లాభం చేకూరుతుంద‌న్నారు. ఆర్టీసీని ర‌క్షించేది ప్ర‌భుత్వం మాత్ర‌మే. ప్ర‌భుత్వం ద్వారానే ఆర్టీసీ కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవాలి' అని థామ‌స్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.  


logo